అసలే జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు వేలాది ఎకరాలు ఆక్రమించిన విషయం బయటపడటంతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. దానికి మూర్తిగారి కబ్జా వ్యవహారం బోనస్ అన్నమాట.

చంద్రబాబునాయుడు పాలన కబ్జాలు, ఆక్రమాలతో బ్రహ్మాండంగా ఉంది. తాజాగా వెలుగు చూసిన కబ్జాతో చంద్రబాబునాయుబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంతకాలం నేతలు చేసిన కబ్జాలు వేరు ఇపుడు బయటపడిన కబ్జా కథ వేరు. ఎందుకంటే, రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన నేతలున్నారు. ప్రైవేటు భూములను కబ్జా చేసిన నేతలూ ఉన్నారు.

అయితే, ఈ కబ్జా మాత్రం బాగా ప్రత్యేకం. ఎందుకంటే, విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ భూములను కబ్జా చేసింది స్వయానా చంద్రబాబుకు దగ్గరి బంధువు. అదేనండి చంద్రబాబు వియ్యంకుడు కమ్ బావమరది నందమూరి బాలకృష్ణకు దగ్గర బంధువైన ఎంవివిఎస్ మూర్తి. ఎంఎల్సీ అయిన మూర్తి, గతంలో విశాఖపట్నం ఎంపిగా కూడా పనిచేసారు లేండి.

మూర్తి రాజకీయంగా, ఆర్ధికంగా బాగా బలవంతుడు. కాబట్టే టిడిపిలో ఆయన మాటకు ఎదురేలేదు. అటువంటి మూర్తి 55 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసారు. ఇంక ఆయనకు అడ్డేముంటింది. ఆక్రమించుకోవటం, అతిధి గృహం నిర్మించుకోవటం అన్నీ చకచక జరిగిపోయింది. అయితే విషయమేమిటేం ఈయనగారు ఆక్రమించుకున్న భూములు గతంలోనే ఓ విద్యాసంస్ధకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వమే కేటాయించింది.

తమకు కేటాయించిన భూములు ఎవరో ఆక్రమించారని అందిన ఫిర్యాదుతో రెవిన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. మొత్తం భూములన్నింటినీ సర్వే చేసింది. దాంతో అసలు విషయం బయటపడింది. ఇంతకీ భూములు ఆక్రమించుకుని భవనాలు కట్టుకున్నదెవరని ఆరాతీసారు. దాంతో అసలు విషయం తెలిసి మూర్తిగారి నిర్వాకం బయటపడింది. సరే, అదే విషయాన్ని రెవిన్యూ యంత్రాంగం ఉన్నతాధికారులకు నివేదికరూపంలో అందించింది.

ఇంతకీ మూర్తి ఆక్రమించుకున్న భూముల విలువ సుమారు రూ. వెయ్యి కోట్లట. విషయం బయటపడేటప్పటికి ప్రభుత్వంలోని ‘ముఖ్యులు’ చురుగ్గా కదిలారు. అసలే పార్టీలో కీలక నేత పైగా నందమూరి బాలకృష్ణకు దగ్గర బంధువు. ఇంకేముంది అక్రమాలన్నీ సక్రమాలు చేయటానికి రంగం సిద్ధమైపోయిందట.

తన ఆక్రమణల్లో ఉన్న భూములను తనకే కేటాయించాలంటూ అర్జీ పెట్టుకున్నారట. వెంటనే అర్జీకి సానుకూలంగా ఫైలు సిద్ధమైపోయింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆక్రమణలను సక్రమంగా చేయటానికి ఏర్పాట్లు సిద్ధమైపోయిందని ఓ మీడియాలో గుప్పుమన్నది. దాంతో పెద్దాయన ఆక్రమణలు ఇపుడు చంద్రబాబుకు చుట్టుకుంటోంది.

అసలే జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు వేలాది ఎకరాలు ఆక్రమించిన విషయం బయటపడటంతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. దానికి మూర్తిగారి కబ్జా వ్యవహారం బోనస్ అన్నమాట. మొత్తం మీద చంద్రబాబు పాలన గడచిన మూడేళ్ళుగా ఆరు కబ్జాలు పన్నెండు ఆక్రమాలుగా బ్రహ్మాండంగా సాగిపోతోంది.