బ్యాంకులు ప్రజలకు  సరిపడా డబ్బులు ఇవ్వటం లేదంటే అందుకు బాధ్యత ఆర్బిఐ లేదా కేంద్ర ఆర్ధికశాఖదే.

పెద్ద నోట్ల సంక్షోభానికి ఏపిలో బ్యాంకర్లే కారణమా? ప్రస్తుత సంక్షోభానికి దేశమంతా ప్రధాని నిర్ణయం వల్లేనని మండిపడుతుంటే రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు బ్యాంకర్లపై మండిపడుతున్నారు. కరెన్సీ సంక్షోభానికి బ్యాంకర్లు సరైన పరిష్కారాలు కనుక్కోవటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు తీవ్రంగా మండిపడటం గమనార్హం. సంక్షోభం ఏర్పడి 20 రోజులైనా సమస్య పరిష్కారానికి బ్యాంకర్లు ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా బ్యాంకర్ల తీరుపై అరుణ్ జైట్లీకి సైతం ఫిర్యాదు చేయటం గమనార్హం.

పెద్ద నోట్ల సంక్షోభానికి అసలు కారకులు ప్రధాని నరేంద్రమోడి. సహాయ పాత్ర కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులది. ఒక వ్యక్తి తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్ల యావత్ దేశమంతా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిందని దేశంలోని అన్నీ వర్గాలూ ప్రధానిపై దుమ్మెత్తిపోస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

అసలు బ్యాంకర్లకు, సంక్షోభానికి సంబంధం ఏమిటని ఎంత బుర్రగోకున్నా అర్ధం కావట లేదు. రిజర్వ్ బ్యాంకు అన్నీ బ్యాంకులకు సరిపడా డబ్బులు పంపని కారణంగానే బ్యాంకులు ఖాతాదారులకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాయన్న సంగతి చంద్రబాబుకు తెలీదా?

కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి ఎక్కువ డబ్బులు తీసుకురావాల్సింది ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తులే. ఏ రాష్ట్రానికి ఎంత డబ్బులు పంపాలన్నది ఆర్బిఐ ఉన్నతాధికారులు, కేంద్ర ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులే. వారినందరినీ పర్యవేక్షించే బాధ్యత కేంద్ర ఆర్ధికశాఖ మంత్రిదే.

అటువంటిది చంద్రబాబు బ్యాంకర్లను ఆడిపోసుకోవటం ఎందుకు. బ్యాంకులు ప్రజలకు సరిపడా డబ్బులు ఇవ్వటం లేదంటే అందుకు బాధ్యత ఆర్బిఐ లేదా కేంద్ర ఆర్ధికశాఖదే. అలాగే, చంద్రబాబు కేంద్రంపై గట్టిగా ఒత్తడి తెచ్చి వుంటే ఇపుడు వచ్చిన దానికన్నా మరింత ఎక్కువ నిధులు వచ్చేవేమో. రాష్ట్రానికి ఎక్కువ డబ్బులు కావాలని, వంద రూపాయల నోట్లు ఎక్కువగా పంపాలని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసినా కేంద్రం ఏమాత్రం ఖాతరు చేయలేదు.

అంటే, ’అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు’ కేంద్రాన్ని, ఆర్బిఐని ఏమీ అనలేని చంద్రబాబు తేరగా దొరికారని బ్యాంకు అధికారుల మీద మండిపడితే ఏమిటి ఉపయోగం. ఇపుడు పనిచేసే వారిని కూడా సక్రమంగా చేయనియ్యకపోవటం తప్ప మరేమి కాదు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకులు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. చేతనైతే మోడినో లేక జైట్లి మీదో తన ప్రతాపం చూపితే ఏమన్నా ఉపయోగం ఉంటుంది.

సోమవారం లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద రూ. 500 నోట్లు రూ.95 కోట్లున్నాయి. రూ. 100 నోట్లు 62 కోట్లున్నాయి. రూ. 2 వేల నోట్లు 1320 కోట్లున్నాయి. రూ. 20 నోట్లు 8 కోట్లున్నాయి. రూ. 10 నోట్లు 2.6 కోట్లున్నట్లు సమాచారం. డిసెంబర్ 1వ తేదీకి చిన్న నోట్ల సమస్య లేకుండా ఉండాలంటే రూ. 100 నోట్లు కనీసం 1000 కోట్లుండాలని అంచనా. మరి, అంత మొత్తాన్ని తెప్పించటమంటే చంద్రబాబు వల్లే అవుతుంది కానీ బ్యాంకుల వల్ల ఏమవుతుంది?