పెద్ద నోట్ల రద్దు దెబ్బకు చంద్రబాబుకు ఏదో అవుతున్నట్లే ఉంది.

తానేం మాట్లాడుతున్నారో చంద్రబాబుకు అర్ధం అవుతున్నట్లు లేదు. పూటకో మాట మాట్లాడుతూ ఇటు అధికార యంత్రాంగాన్న అటు పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు దెబ్బకు చంద్రబాబుకు ఏదో అవుతున్నట్లే ఉంది.

ఒక రోజు పెద్ద నోట్ల రద్దు చేయమని తానే మోడికి చెప్పానంటారు. రెండు రోజుల తర్వాత నోట్ల రద్దుపై జనాల ఆగ్రహాన్ని గమనించి నోట్ల రద్దుపై మోడికి తానేమీ చెప్పలేదంటారు. పెద్దనోట్లను రద్దు చేయమని చెప్పానే గానీ 2 వేల రూపాయల నోట్లను తెమ్మని చెప్పలేదంటారు.

ఇంకో రోజు పెద్ద నోట్ల రద్దు అతిపెద్ద సంక్షోభమంటారు. మరుసటి రోజే పెద్ద నోట్ల రద్దుపై మోడి సరైన చర్యే తీసుకున్నారని కితాబునిస్తారు. నగదు లావాదేవీల బదులు డిజిటల్ లావాదేవీలు చేయాలంటారు. మరుసటి రోజు మన వద్ద అన్ని మెషిన్లు లేవంటారు. నగదు లేకపోతే ప్రజలు సహనం కోల్పోతారని ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు గట్టిగా చెబుతారు.

ఇంకోరోజు ప్రజలందరూ డిజిటల్ లావాదేవీలే చేయాలంటారు. తాజాగా మొన్ననే జరిగిన పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు మనం కోరుకున్నది కాదన్నారు. మరుసటి రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో పెద్ద నోట్ల రద్దు చేయమని తానే ప్రధానికి చెప్పానని అన్నారు.

శుక్రవారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో పెద్ద నోట్ల రద్దు తన జీవితంలోనే అతి పెద్ద సంక్షోభమని మళ్ళీ మొదలుపెట్టారు. ఓ వైపు నగదు రహిత లావాదేవీలకు కృషి చేయాలని చెప్పారు. కాసేపైన తర్వాత అభివృద్ధి చెందిన దేశాల్లోనే నగదు రహిత లావాదేవీలు సాధ్యం కాలేదు మన దగ్గర ఎలా సాధ్యమవుతుందన్నారు. దాంతో బ్యాంకర్లు ఏమి సమాధానం చెప్పాలో తెలీక జుట్టు పీక్కున్నారు.

ఇన్ని రకాలుగా పిల్లి మొగ్గలేస్తున్న చంద్రబాబుకు అసలేమైందంటూ పార్టీ శ్రేణులు, అధికార యంత్రాంగం, మీడియా తలలు బాదుకుంటున్నారు.