జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రతిపక్ష నేతలకు ఒకనీతి. అధికార పార్టీ వారికైతే మరోనీతి. ఎంతబాగుందో చంద్రన్న పాలన?
మ్యాటర్ సెటిల్డ్. రవాణా శాఖ కమీషనర్ పై టిడిపి నేతల దుర్భాషలకు సంబంధించిన వ్యవహారాన్ని చంద్రబాబునాయుడు సెటిల్ చేసేసారు. కమీషనర్ కు ఎంపి, ఎంఎల్ఏ, ఎంఎల్సీలతో క్షమాపణ చెప్పించేసారు. దాంతో మ్యాటర్ ఫినిష్. మరి చట్టం, న్యాయం ఏం చేస్తున్నాయని అడగ్గూడదు. ఎందుకంటే, ఇది చంద్రబాబు జమానా. జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రతిపక్ష నేతలకు ఒకనీతి. అధికార పార్టీ వారికైతే మరోనీతి. ఎంతబాగుందో చంద్రన్న పాలన? శనివారం సాయంత్రం రవాణా కమీషనర్ కార్యాలయం వద్ద ఎంపి కేశినేని నాని, ఎంఎల్ఏ బోండాఉమ, ఎంఎల్సీ బుద్దా వెంకన్నలు కమీషనర్ బాలసుబ్రమణ్యం, డిటిసిలపై బహిరంగంగానే దుర్భాషలాడారు. కమీషనర్ భద్రతా సిబ్బందిపై బోండా చేయి కూడా చేసుకున్నారు.
దాంతో ఘటన సంచలనమైంది. మీడియాలో బాగా హైలైట్ అయింది. పచ్చ మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదనుకోండి అది వేరే సంగతి. అందుకనే సోషల్ మీడియాలో అయితే పచ్చ నేతలపైన, పచ్చ మీడియాపైన దుమ్ము రేగిపోయింది. దాంతో చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఈరోజు ఉదయం కమీషనర్తో పాటు ప్రజాప్రతినిధులను పిలిపించారు. లోపల ఏం జరిగిందో ఏమో. క్యాంపు కార్యాలయం బయటకు వచ్చిన బోండా ఉమ, నాని మీడియాతో మాట్లాడుతూ, కమీషనర్ ను క్షమాపణ అడిగారు. దాడికి చింతిస్తున్నట్లు చెప్పారు. జరిగిన ఘటన దురదృష్టకరమట. కమీషనర్ ను కలిసి విచారం వ్యక్తం చేస్తామని కూడా అన్నారు.
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చాలా బాగుంది కదా? ఎంతైనా అధికార పార్టీ నేతలు కదా. అందులోనూ చంద్రబాబుకు బాగా సన్నిహితులు. ఇంకేముంది. అధికారులు కూడా ఏం మాట్లాడలేకపోయారు. కమీషనర్ ను బహిరంగంగా అవమానం చేసి, సిబ్బందిపై చేయి చేసుకున్న తర్వాత కూడా ప్రజాప్రతినిధులపై ఎటువంటి చర్యలు లేవంటే చట్టం ఎంత బాగా పనిచేస్తోందో? మరి ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల సంఘం నోరు ఇపుడు ఎందుకు మూతపడిపోయిందో? ప్రజాప్రతినిధుల దుర్భాషలపై వీడియో, ఆడియో సాక్ష్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా తాము ఎవరినీ దూషించలేదని ఎంపి నాని అంటున్నారంటే చట్టం ఎంత గుడ్డిదో అర్ధమైపోతోంది. అంటే చంద్రన్న పాలనలో వ్యవస్ధలన్నీ కళ్ళ మూసుకునే పనిచేయాలేమో?
