తనకు ఎంఎల్సీ ఇచ్చిన తర్వాత తన కొడుక్కు మళ్ళీ ఎంఎల్ఏ టిక్కెట్టు ఇస్తారని కరణం ఎలా అనుకున్నారో?

కరణం బలరాం ఆశలపై చంద్రబాబునాయుడు నీళ్ళు చల్లినట్లే. ప్రకాశం జిల్లా నుండి ఇటీవలే ఎంఎల్సీగా గెలిచిన కరణంకు చంద్రబాబు గట్టి క్లాసే తీసున్నారట. దాంతో ఏం చేయాలో కరణంకు అర్ధం కావటం లేదని నియోజకవర్గంలో చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుండి తన కొడుకు వెంకటేష్ కు
 సీటు ఇప్పించుకోవాలని కరణం గట్టి ప్లానే వేసారు. అయితే, వైసీపీ నుండి ఫిరాయించిన గొట్టిపాటి రవికుమార్ అడ్డుగా నిలిచారు. దాంతో రెండు వర్గాల మధ్యా ప్రతీ రోజు బహిరంగంగానే పోరాటాలే. ఆధిపత్యం పోరాటాలు ఎంతగా సాగుతున్నాయంటే, ఇద్దరిలో ఒకరు ఓ అధికారిని బదిలీ చేయిస్తారు. వెంటనే రెండు వర్గం అదే అధికారిని అదే స్ధానంలో మళ్ళీ కూర్చోబెట్టేంత.

అంతస్ధాయిలో రెండు వర్గాలు కొట్టేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి రెండు వర్గాల్లోనూ అభద్రత చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య సయోధ్య చేసేందుకు చంద్రబాబు చేసిన అన్నీ ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఈ నేపధ్యంలోనే కరణంను చంద్రబాబు ఎంఎల్సీ చేసారు. ఎప్పుడైతే తాను ఎంఎల్సీ అయిపోయారు ఇక నియోజకవర్గంలో మళ్ళీ చక్రం తిప్పవచ్చని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా జోరు కూడా పెంచారు.

ఇంతలో కరణాన్ని సిఎం పిలిపించుకున్నారు. ఏకాంతంగా కూర్చోబెట్టుకుని పెద్ద క్లాసే పీకారట. భవిష్యత్తులో అద్దంకి నియోజకవర్గంలో ఎట్టి పరిస్ధితుల్లోనూ, ఏ విధంగానూ జోక్యం వద్దని హెచ్చరించారట. నియోజకవర్గానికి సంబంధించిన సమస్త వ్యవహారాలు గొట్టేపాటే చూసుకుంటారని కూడా స్పష్టం చేసారట. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గొట్టిపాటే పోటీ చేస్తారు కాబట్టి ఇబ్బందులు పెట్టవద్దని చెప్పారట. దాంతో కరణం ఆశలపై నీళ్ళు చల్లినట్లైంది. తనకు ఎంఎల్సీ ఇచ్చిన తర్వాత తన కొడుక్కు మళ్ళీ ఎంఎల్ఏ టిక్కెట్టు ఇస్తారని కరణం ఎలా అనుకున్నారో?