టిడిపికి 135 సీట్లు ఖాయం..

Naidu says tdp will get 135 seats in the coming elections
Highlights

  • ప్రధాన ప్రతిపక్షం వైసిపి పరిస్ధితి మరీ అంత దారుణంగా తయారైందా.

ప్రధాన ప్రతిపక్షం వైసిపి పరిస్ధితి మరీ అంత దారుణంగా తయారైందా. వచ్చే ఎన్నికల్లో టిడిపి 135 సీట్లలో గెలుస్తుందా? కేవలం 40 సీట్లలో మాత్రమే వైసిపి పోటీ ఇచ్చే స్ధితిలో ఉందా? ఏంటి ఈ లెక్కలన్నీ నిజమేనా? చంద్రబాబునాయుడు చెబుతున్నారు కాబట్టి నిజమని అంగీకరించాల్సిందేనేమో? ఒకవైపేమో వైసిపి అధినేత వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే అని ఢంకా భజాయించి మరీ చెబుతోంది. అధికార టిడిపిపై ప్రజల్లో వ్యతికేకత ప్రభలిపోయిందని ఊరు వాడ మైకులు పెట్టి జగన్ మరీ చాటింపు వేస్తున్నారు. దానికి తగ్గట్లే ప్రజాసంకల్పయాత్రలో పాదయాత్రకు జనాలు కూడా విశేషంగా హాజరవుతున్నారు. ఒకవైపు పాదయాత్రకు హాజరవుతున్న జనాలు, ఇంకోవైపు చంద్రబాబు చెబుతున్న మాటలు.. రెండింటిలో ఏది నిజం? ఇపుడీ అనుమానమే అందరి బుర్రనూ తొలిచేస్తోంది.

శుక్రవారం జరిగిన టిడిఎల్పీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విషయమై ఎవరికీ 0.0000 శాతం కూడా అనుమానం అవసరం లేదన్నారు. ప్రతిపక్షం పూర్తిగా దెబ్బతినేసిందట. చాలా నియోజకవర్గాల్లో వైసిపి పోటీ ఇవ్వగలిగిన స్ధితిలో కూడా లేదని చంద్రబాబు చెప్పారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో మహా అయితే వైసిపి పోటీ ఇవ్వగలిగింది 40 నియోజకవర్గాల్లోనే అట. మిగిలిన 135 నియోజకవర్గాల్లో టిడిపి హవానే ఉంటుందని జోస్యం చెప్పేసారు.

అంటే, చంద్రబాబు ఏ స్ధాయిలో చెప్పారంటే, వచ్చే ఎన్నికల్లో 135 నియోజకవర్గాల్లో టిడిపి నామినేషన్లు వేస్తే చాలు గెలిచేసినట్లే అని అర్ధం వచ్చేట్లు చెప్పారు. ‘ఎన్నికలైన మూడున్నరేళ్ళ తర్వాత టిడిపి రాజకీయంగా బాగా బలంగా ఉంది’ అన్నారు. జనాలు కూడా ‘అసలు రాష్ట్రంలో ప్రతిపక్షమే అవసరం లేద’ని అనుకుంటున్నారని సిఎం కు ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ఇంటింటికి తెలుగుదేశంపార్టీ కార్యక్రమంలో నేతలు తాను చెప్పిన విషయాలను గమనించే ఉంటారు అని కూడా అన్నారు. ‘టిడిపి అధికారంలో ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని, తమ జీవన ప్రమాణాలు మెరుగవుతాయని జనాలందరూ నమ్ముతాన్నార’ని కూడా చంద్రబాబు వెల్లడించారు.

సరే, చంద్రబాబు ఇలాంటి మాటలు చాలానే చెప్పటం, నేతలు కూడా అవునంటూ తలూపటం మామూలే అనుకోండి. అయితే, షరతులు విధించబడును అన్నట్లుగా చంద్రబాబు ఓ మాట మెల్లిగా చెప్పారు. ఇంతకీ అదంటంటే, ‘ఎంఎల్ఏలు, నియోజకవర్గ ఇన్చార్జిలు తప్పులు చేసి బలహీనపడితే వారిని తాను కాపాడలేను’ అని. అంటే అర్ధమేంటి? అటువంటి నియోజకవర్గాల్లో టిడిపి ఓడిపోతుందనే కదా? నేతల మధ్య జరుగుతున్నగొడవలు చూస్తుంటే అటువంటి నియోజకవర్గాలు ప్రతి జిల్లాలోనూ చాలానే కనబడుతున్నాయే ?

loader