అనంతపురంలో 92 శాతం నష్టం  జరిగినట్లు తన నివేదికల్లో స్పష్టమవుతోందని చంద్రబాబు ఆందోళన పడటంలో తప్పేముంది?

అనంతపురం జిల్లాలో పార్టీ పరిస్ధితి మరీ అంత ఘోరంగా తయారైందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఫలితాలు ఊహించటానికే ఆందోళనగా ఉందని స్వయంగా చంద్రబాబే అన్నారంటేనే పరిస్ధితిని ఎవరైనా అర్ధం చేసుకోవచ్చు. ఒకవైపు పార్టీలోని సొంత నేతల మధ్య కుమ్ములాటలు తారాస్ధాయికి చేరుకున్నది.మరోవైపు ఎక్కడికక్కడ టిడిపికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇంకోవైపు ప్రభుత్వంపై సహజంగానే ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత తదితర కారణాల వల్ల చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇది ఒక్క అనంతపురం జిల్లా పరిస్ధితి మాత్రమే కాదు. దాదాపు అన్నీ జిల్లాలోనూ ఇదే పరిస్ధితి. అందుకనే చంద్రబాబు జిల్లాల సమన్వయ కమిటీ సమావేశాలు మొదలుపెట్టారు.

 ఇందులో భాగంగానే ముందు అనంతపురం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్ధితిని వివరించి బాగా క్లాస్ పీకారు. మొన్నటి ఎన్నికల్లో 12 స్ధానాల్లో గెలిచిన పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎంత ఘోరంగా ఉంటుందో ఎవరికి వారే అర్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ కనీసం 20-30 శాతం పార్టీకి నష్టం జరిగిందన్నారు. కృష్ణ లో 56 శాతం, గుంటూరులో 52 శాతం నష్టం వాటిల్లినట్లు ఆందోళన వ్యక్తం చేసారు. ఈ జిల్లాలతోనే తాను ఇబ్బందులు పడుతుంటే అనంతపురంలో 92 శాతం నష్టం జరిగినట్లు తన నివేదికల్లో స్పష్టమవుతోందని చంద్రబాబు ఆందోళన పడటంలో తప్పేముంది?

జిల్లాలో పార్టీ పరిస్ధితి పట్ల చంద్రబాబు ఆందోళన పడటంలో తప్పులేదు కానీ, ఈ పరిస్ధితి ఇప్పటికిప్పుడు ఇలా తయారుకాలేదు. జిల్లాలో నేతల మధ్య సమస్యలు మొదలైనపుడే పిలిపించి మాట్లాడి సర్దబాటు చేయాల్సింది. కానీ అప్పుడు పట్టించుకోలేదు. ఇపుడేమో పరిస్ధితి చేయి దాటిపోయింది. ఈ విషయం నేతలకు ఎప్పుడో అర్ధమవ్వగా చంద్రబాబుకు ఇప్పుడు అర్ధమైంది. అందుకు హిందుపురం నియోజకవర్గమే ఉదాహరణ. రెండున్నర సంవత్సరాలుగా హిందుపురంలో బావమరిది కమ్ వియ్యంకుడు కమ్ ఎంఎల్ఏ బాలకృష్ణ పిఏ శేఖర్ నిర్వాకానికి నియోజకవర్గంలో పార్టీ శ్రేణలు, ప్రజలు పూర్తిగా వ్యతిరేకమయ్యారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఇదే తరహా గొడవలు. కాబట్టి జిల్లాలో పార్టీ పరిస్ధితి ఈ విధంగా దిగజారటానికి చంద్రబాబుదే పూర్తి బాధ్యత.