మ్యారేజి బ్యూరోలపై చంద్రబాబు కన్ను?

First Published 22, Nov 2017, 8:50 AM IST
Naidu says dwacra groups should turn as marriage mitras
Highlights
  • చంద్రబాబునాయుడు మ్యారేజ్ బ్యూరోలను పెద్ద దెబ్బే కొట్టేట్లున్నారు.

మ్యారేజి బ్యూరోలపై చంద్రబాబునాయుడు కన్నేయటమేంటని ఆశ్చర్యపోతున్నారా? చంద్రబాబేమీ మ్యారేజి బ్యూరో పెట్టటం లేదులేండి. కాకపోతే మ్యారేజి మిత్రలుగా మారమంటూ మహిళలకు పిలుపునిచ్చారు. చూడబోతే చంద్రబాబు వల్ల మ్యారేజ్ బ్యూరోలకు పెద్ద దెబ్బే పడేట్లుగా ఉంది. మ్యారేజి మిత్రలుగా మారాలని డ్వాక్రా మహిళలకు పిలుపునివ్వటం ద్వారా మ్యారేజి బ్యూరోలను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. చంద్రబాబు ఉద్దేశ్యం ప్రకారం ఇపుడు మ్యారేజి బ్యూరోలు చేస్తున్న పనినే డ్వాక్రా మహిళలు చేయాలట. అంటే అర్ధమేంటి?

రాష్ట్రంలో దాదాపు 8 వేల డ్వాక్రా గ్రూపులున్నాయి. 8 వేల గ్రూపుల్లో సుమారు 60 లక్షల మహిళలకు సభ్వత్యాలున్నాయి. చంద్రబాబు చెప్పేదాని ప్రకారం వారంతా ప్రస్తుతం చేస్తున్న పనులతో పాటు మ్యారేజి మిత్రలుగా మారాలట. అంటే వివిధ పనుల మీద డ్వాక్రా మహిళలు అనేక చోట్లకు తిరుగుతుంటారు. అలా తిరిగే సమయంలో వారికి అనేకమంది తారసపడుతుంటారు. పదిమంది కలిసినపుడు మంచి చెడ్డా మాట్లాడుకోవటం సహజమే కదా?

అటువంటి సమయంలోనే అవసరమైన వారి ఇళ్ళల్లో వివాహాలకున్న వారి గురించి వాకాబు చేయాలట. అటువంటి వారికి మంచి సంబంధాలుంటే చెప్పాలట. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లన్న తేడా లేకుండా బంధువులో, స్నేహితులో  చాలామంది ఇపుడు ప్రవృత్తిగా అదే చేస్తున్నవారు మనకు కనబడుతూనే ఉంటారు. కాకపోతే తమ విధుల్లో భాగంగా డ్వాక్రా సభ్యురాళ్ళు మ్యారేజి మిత్రలుగా మారాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

చంద్రబాబు పిలుపును గనుక డ్వాక్రా మహిళలు సీరియస్ గా తీసుకుంటే అదే వృత్తిగా ఉన్న మ్యారేజి బ్యూరోలు పడకేసినట్లే. మ్యారేజి బ్యూరోల వ్యాపారం ఒక విధంగా చెప్పాలంటే నగరాలకు, పట్టణాలకే పరిమితమైంది. కాకపోతే, గ్రామీణ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న కుటుంబాలు వచ్చి మ్యారేజి బ్యూరోల్లో మంచి సంబంధాల కోసం సంప్రదించటం సహజం. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలు, నగరాలకు వచ్చి స్దిరపడుతున్న కుటుంబాల సంఖ్య పెరిగిపోతున్న నేపధ్యంలో డ్వాక్రా మహిళలు గనుక మ్యారేజి మిత్రలుగా యాక్టివ్ అయితే మ్యారేజి బ్యూరోలకు దెబ్బపడటం మాత్రం ఖాయం.  

 

loader