1995 లో హైదరాబాద్- 2016 లో అమరావతి . ఈ కనెక్షన్ ఏమిటి?

అమరావతి - హైదరాబాద్ లకు ఒక పోలిక కనిపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

1994లో చంద్రబాబు నాయుడు మొదటి సారిముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సీటులో కుదటపడే సరికి 1995 వచ్చింది. అపుడు హైదరాబాద్ జనాభా ఎంతో తెలుసా? ఇపుడు అమరావతి పరిసరాల్లో ఉన్నంతే... అంటే 30 నుంచి 35 లక్షలు.

ఈ జనాభాతో ఆయన ఆరోజు హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరం చేసేందుకు పూనుకున్నారు. ఇపుడు అంతేజనాభా ఉన్న అమరావతిని వరల్డ్ క్లాస్ రాజధాని చేయాలనుకుంటున్నారు. ఈ జనాభా విషయాన్ని బుధవారంనాడు ఆయన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మీద జరిగిన ఒక సమీక్షా సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ను కూడా ఆయన ప్లాన్ చేశారని చెబుతాారు.

ఇపుడు అమరావతి అవుట్ రింగ్ రోడ్ ప్లాన్ లో ఆయన చాలా బిజీగా ఉన్నారు. అదిలా ఉంటుంది.

 రాజధానిఅమరావతి పరిధిలో చుట్టూ వున్న పట్టణాలు, జాతీయ రహదారులను కలిపుతూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడతారు. రెండు రోజులలో దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తర్వాత మంత్రిమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.

 తెనాలి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి వంటి పట్టణాలతో పాటు చెన్నయ్-కలకత్తా జాతీయరహదారి, విజయవాడ-ముంబై జాతీయ రహదారి, విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారితో పాటు కొత్తగా నిర్మించబోయే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ రహదారిని కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

రానున్న కాలంలో రాజధాని అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ శాటిలైట్ టౌనషిప్స్ అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ తుది ప్రణాళిక సిద్ధమైతే దీనిపై సవివర ప్రాజెక్టు నివేదికను తయారుచేసి కేంద్రానికి అందిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రస్తుతం వుండే జనాభా 30 నుంచి 35 లక్షల వరకు వుంటుందని, ఇది 1995లో ఇది హైదరాబాద్ జనాభా అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

 రాజధాని పరిధిలోని నగరాలు, చుట్టూ వుండే పట్టణాలు, కొత్తగా వచ్చే శాటిలైట్ టౌన్‌షిప్‌లకు 30 లేదా 45 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా రవాణా వ్యవస్థ వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.