పార్టీలో పెరిగిపోతున్న క్రమశిక్షణారాహిత్యం మీద టిడిపి బాసు చంద్రబాబుకు కోపమొచ్చింది
రైతులు- ఆడ, మగ- కర్రలుపట్టుకుని ఆపీసర్లను , పోలీసులను తరిమి తరిమికొట్టేదాకా, వంశ ధార రైతులకు నష్టపరిహారం ఇవ్వ లేదని, ఇవ్వకుండా ప్రాజక్టు పనులు ప్రారంభిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియ లేదు. మరి ఇన్ని రివ్యూలు, పర్యటనలు... ఎందుకు.
శ్రీకాకుళం రైతుల యుద్ధం ఈ రోజు పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రతిధ్వనించింది. ఇంతకు ముందే ఆయన రైతులకు క్షమాపణలు చెప్పారు. అయితే, జిల్లాలో మంత్రి అచ్ఛన్నాయుడు, పక్కనే టిడిపి రాష్ట్ర కమిటి అధ్యక్షుడు కళావెంకటరావు ఉన్నా, తమకు రావలసినది రాబట్టుకోవడానికి ప్రజలు కర్రలు పట్టుకుని అధికారులను వెంబడించాల్సి వచ్చింది.
ఇది పార్టీ పరువును బాగా మంటగలిపింది.
ఈ రోజు జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రస్తావిస్తూ నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లా నాయకులపై మండిపడ్డారు. వంశధార క్షేత్రస్థాయి పరిస్థితిని ఎందుకు అంచనా వేయలేకపోయారని ప్రశ్నించారు. ఈ విషయంలో పార్టీ నాయకత్వ తీరులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. హింసాత్మక ఘటనలు జరిగితేగానీ తెలుసుకోలేకపోతున్నారా? అని అడిగారు. జూన్‌లోనే నష్టపరిహారానికి సంబంధించిన జీవో ఇస్తే ఇంత వరకు అమలు కాకపోవడం ఏమిటనీ ప్రశ్నించారు.
కడప జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి అవుతుంటే శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు పూర్తి కావని నిలదీశారు. నిర్వాసితుల సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.
ఇదే కోపాన్నా పార్టీలో పెరిగిపోతున్న క్రమశిక్షణ రాహిత్యం పై కూడా ప్రదర్శించారు.
ఇకపై పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని హెచ్చరించారు. సంక్షేమ మంత్రి రావెల కిషోర్ బాబు, గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్ జానీమూన్ వ్యవహారన్ని ప్రస్తావిస్తూ ఎన్నికలకు ముందే పార్టీలోకి వచ్చినా రావెల, జానీమూన్‌లకు క్రమశిక్షణ గురించి తెలియదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇక చిన్న, పెద్దా అని చూడబోనని, తేడా వస్తే వేటు వేస్తానని చంద్రబాబు హెచ్చరించారు.
ఈ సమావేశంలో పవన్ కల్యాన్ వ్యాఖ్యలను కొందరు మంత్రులు ప్రస్తావించారు. జల్లికట్టు తర్వాత రాష్ట్రంలో అలజడి ఉంటుందని భావించానని అయితే జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు పొంతన లేదని ఆయన వివరించారు. ప్రతిపక్షాలు ఉద్యమాలపై దృష్టి పెడతాయని, పార్టీ పరంగా ధీటుగా స్పందించాలని నేతలకు బాబు దిశ నిర్దేశం చేశారు.
