జగన్ యాత్రపై చంద్రబాబు దృష్టి

Naidu is very keen and getting reports on jagans yatra daily
Highlights

  • మొత్తానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర తెలుగుదేశంపార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది.
  • చివరకు చంద్రబాబునాయుడు కూడా జగన్ యాత్ర గురించి రెగ్యులర్ గానే నివేదికలు తెప్పించుకుంటున్నారు.

మొత్తానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర తెలుగుదేశంపార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది. చివరకు చంద్రబాబునాయుడు కూడా జగన్ యాత్ర గురించి రెగ్యులర్ గానే నివేదికలు తెప్పించుకుంటున్నారు. అంతేకాకుండా జగన్ యాత్రను తన ఛాంబర్లో కూర్చుని చంద్రబాబు టివిలో చూస్తున్నట్లుగా ఉన్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు, ప్రజాసంఘాలు ఆందోళనల విషయంలో ప్రభుత్వం ఇంటెలిజెన్స్ సిబ్బందిని వినియోగించటం, పోలీసుల సహకారం తీసుకోవటం మామూలుగా జరిగేదే.

కానీ జగన్ పాదయాత్ర గురించి మాత్రం చాలా ఎక్కువ జాగ్రత్తలే తీసుకుంటోంది. సాధారణ పోలీసులు, నిఘా విభాగం అధికారులే కాకుండా నారాయణ కాలేజి విద్యార్ధులతో కూడా యాత్ర ప్రభావం గురించి వాకాబు చేయిస్తున్నట్లు జగన్ మీడియా వెల్లడించింది. పాదయాత్రలో జగన్ చేరుకోబోయే ముందు ప్రాంతాలకు నిఘా అధికారులు ఇంకా ముందుగానే చేరుకుని జగన్ కు కోసం ఎదురు చూస్తున్న వారితో మాట్లాడుతున్నారట. అలాగే, జగన్ యాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి జగన్ ప్రసంగాల ప్రభావంపై అంచనా వేస్తున్నారట.

 

యాత్ర మొదలైన మూడో రోజు నుండి పోలీసుల చొక్కాలకే కెమెరాలు వేలాడుతూ కనిపిస్తున్నాయ్. యాత్రలో హాజరవుతున్న జనాల విషయంలో ప్రభుత్వం మూడు రకాల సర్వేలు చేయిస్తోంది. హాజరవుతున్న జనాల్లో వయస్సుల వారీగా ఒకటి, మహిళలు, మద్య, వృద్ధులతో నిఘా విభాగం అధికారులు మాట్లాడుతున్నారు. జగన్ పై అభిమానంతో యాత్రలో పాల్గొంటున్నారా లేక ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే హాజరవుతున్నారా అన్న విషయంపై అదికారులు ఎక్కువగా వాకాబు చేస్తున్నారట.

యాత్ర విశేషాలను పోలీసులు ద్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు లైవ్ లో పంపుతున్నారట. వివిధ మార్గాల్లో సేకరిస్తున్న పాదయాత్ర వివరాలను ఉన్నతాధికారులు ఏ రోజుకారోజు చంద్రబాబుకు నివేదిక రూపంలో అందిస్తున్నారట. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు బహిరంగసభలు, జమ్మలమడుగులో పాదయాత్రలో హాజరైన జనాల గురించి ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నారట.అసెంబ్లీ మొదటిరోజు మంత్రులు, ఎంఎల్ఏలు జగన్ పాదయాత్ర గురించే ఎక్కువ మాట్లాడుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతైనా ప్రధానప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తున్నారంటే చంద్రబాబు ఆమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా?

 

 

loader