జిల్లాలో ఆట ఇపుడే మొదలైంది

Naidu is playing dangerous game of strengthening rival factions in kadapa district
Highlights

  • కడప జిల్లాలో ఆట ఇపుడే మొదలైంది.
  • ఉప్పు నిప్పుగా ఉన్న ప్రత్యర్ధులిద్దరూ చెరో పదవిలో ఉన్నారు.
  • దాంతో బలాబలాలు తేల్చుకోవటమే మిగిలింది.

కడప జిల్లాలో ఆట ఇపుడే మొదలైంది. ఉప్పు నిప్పుగా ఉన్న ప్రత్యర్ధులిద్దరూ చెరో పదవిలో ఉన్నారు. దాంతో బలాబలాలు తేల్చుకోవటమే మిగిలింది. ఇంతకీ ఆటేమిటి? బలాబలాలు తేల్చుకోవటమేంటని అనుకుంటున్నారా? చదవండి మీకే తెలుస్తుంది. జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. రామసుబ్బారెడ్డి కుటుంబం తన తండ్రి దగ్గర నుండి తెలుగుదేశంలోనే ఉంది. అదే విధంగా ఆది నారాయణ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ లో ఉంది. కాబట్టి ప్రత్యర్ధులు, వర్గాలు వెరీ క్లియర్.

రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ భూస్ధాపితమైపోయింది. అటువంటి సమయంలో ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ ను వదిలిపెట్టేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి వైసీపీ నుండే అసెంబ్లీకి పోటీ చేసి రామసుబ్బారెడ్డిని ఓడించారు. అయితే, మారిన పరిస్ధితుల్లో ఆది వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించారు. ఆది టిడిపిలో చేరటాన్ని రామసుబ్బారెడ్డి ఎంతగా వ్యతిరేకించినా ఆపలేకపోయారు.

పార్టీలోకి చేరగానే ఆది-రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. దానికితోడు పార్టీ ఫిరాయించిన ఆదికి చంద్రబాబునాయుడు ఏకంగా మంత్రి పదవినే కట్టబెట్టారు. అప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవలు తీవ్ర స్ధాయికి చేరుకున్నాయి. ఎంతైనా మంత్రి కాబట్టి ఆది మాటే చెల్లుబాటవుతోంది. దాంతో రామసుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. టిడిపికి రాజీనామా చేసి వైసీపీలోకి చేరుతారనే ప్రచారం కూడా అప్పట్లో బలంగా వినిపించింది లేండి.

సుబ్బారెడ్డి వైసీపీలోకి చేరుతారనే ప్రచారం చివరకు చంద్రబాబుకూ చేరింది. దాంతో అప్రమత్తమైన సిఎం వెంటనే సుబ్బారెడ్డిని పిలిపించి మాట్లాడటమే కాకుండా హామీలు కూడా ఇచ్చారు. అందులో భాగంగానే సుబ్బారెడ్డికి నంద్యాల ఉపఎన్నిక సమయంలో ఎంఎల్సీని చేశారు. దాంతో సుబ్బారెడ్డి వర్గానికి బలం పెరిగింది. తాజాగా సుబ్బారెడ్డిని శాసనమండలి విప్ గా చంద్రబాబు నియమించారు. దాంతో సుబ్బారెడ్డి మరింత బలోపేతమయ్యారు.

ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే రెండు వర్గాలు బలంగా ఉంటే ఎప్పటికైనా పార్టీకి నష్టమే. ఎందుకంటే ప్రత్యర్ధులిద్దరూ మామూలు వాళ్ళు కాదు. పూర్తి స్ధాయిలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో కూరుకుపోయిన వాళ్ళు. అటువంటి వాళ్ళిద్దరినీ చంద్రబాబు ఒకే పార్టీలో ఉంచుకుని రాజకీయం చేయటమన్నది ఎప్పటికైనా ప్రమాదమే. అసలే ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో అంటూ జిల్లాలోని నేతలు, అధికారులు ఆందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు.

loader