తెలంగాణా టిడిపిలో యువతకే పెద్ద పీట వేయాలని పార్టీ  జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయించారు.

తెలంగాణా టిడిపిలో యువతకే పెద్ద పీట వేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అమరావతిలోబుధవారం టిడిపి సమన్వయ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపి, తెలంగాణా నేతలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చర్చ జరిగింది. రేవంత్ టిడిపిని వదిలేయటంతో పాటు తదనంతర పరిణామాలపై కూడా చర్చ జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇకనుండి తెలంగాణాలో కేవలం యువతను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. చంద్రబాబు తాజా నిర్ణయంతో సీనియర్లకు ఝులక్ ఇచ్చినట్లైంది.

గడచిన మూడున్నరేళ్ళల్లో ఎందరో నేతలు పార్టీని వదిలి వెళ్ళిపోయినా క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా ఉండటాన్ని చంద్రబు ప్రస్తావించారు. కాబట్టి భవిష్యత్తులో పార్టీకి జవసత్వాలు నింపటం యువత వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి యువతకే పెద్ద పీట వేయాలని తాను నిర్ణియించినట్లు చెప్పారు. అంటే చంద్రబాబు ధోరణి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా యువతకే టిక్కెట్లు కేటాయిస్తారేమో అని సీనియర్లలో ఆందోళన మొదలైంది. త్వరలో తెలంగాణా పార్టీ కార్యవర్గాన్ని ప్రక్షాళన చేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. అందులో కూడా యువతకే పెద్దపీట దక్కుతుందేమో చూడాలి.