ఇళ్ళ నిర్మాణ విషయాన్ని మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించటంతోనే ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ చంద్రబాబు భారీస్కెచ్ వేసినట్లు అర్ధమైపోతోంది.

నంద్యాల నియోజకవర్గంలో తాయిలాలను చంద్రబాబునాయుడు సిద్ధం చేస్తున్నారు. ఏ రోజైనా ఉప ఎన్నిక నిర్వహణకు ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన ఇళ్ళ నిర్మాణ పథకానికి శుంకుస్ధాపన చేస్తున్నారు. సరే, ఇళ్ళ నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పుడు పూర్తిచేసి లబ్దిదారులకు సక్రమంగా అందిస్తారు? అన్న విషయాలను పక్కన బెడితే ముందు శంకుస్ధాపన ముహూర్తం అయితే ఫిక్స్ చేసేసారు. మే 1వ తేదీన నంద్యాల నియోజకవర్గంలో 13 వేల ఇళ్ళ నిర్మాణానికి శంకుస్ధాపన చేయబోతున్నారు.

రాష్ట్రమంతా కలిపి 1.10 లక్షల ఇళ్ళు నిర్మిస్తుంటే ఒక్క నంద్యాలలో మాత్రమే 13 వేల ఇళ్ళ నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారంటేనే నంద్యాల ఉప ఎన్నిక గెలుపును ఎంత ప్రతిష్టత్మకంగా తీసుకున్నారో అర్ధమవుతోంది. ఇళ్ళ నిర్మాణ విషయాన్ని మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించటంతోనే ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ఇక్కడ చంద్రబాబు భారీస్కెచ్ వేసినట్లు అర్ధమైపోతోంది.

నియోజకవర్గంలో అసలే గ్రూపు తగాదాలు ఎక్కువ. ఏ వర్గం అనుకూలంగా పనిచేస్తుందో ఏ వర్గం వ్యతిరేకంచేస్తుందో కూడా స్పష్టంగా బయటపడదు. అందులోనూ టిక్కెట్టు శిల్పా వర్గానికి ఇస్తే భూమా వర్గం ఏం చేస్తుందో సస్పెన్స్ గా మారింది. పోనీ భూమా కుటుంబానికే టిక్కెట్టు ఇద్దామంటే శిల్పా మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో ఏ ఒక్క వర్గంపైనో ఆధారపడి ఎన్నికలను ఎదర్కోవటం కష్టమని చంద్రబాబుకు అర్ధమైపోయింది.

అందుకనే ఏ వర్గంపైన కూడా ఆధారపడకుండా సొంతంగానే గెలుపును సొంతం చేసుకునేందుకు వ్యూహాలు మొదలుపెట్టారు. అందులో భాగమే ఇళ్ళ నిర్మాణం. లబ్దిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన జరుగుతుందో అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో రుణమాఫీలు, ‘జాబు రావాలంటే బాబు రావాలి’ లాంటి హామీలు ఈసారి పనిచేయవని చంద్రబాబు గ్రహించినట్లే ఉన్నారు. అందుకే సీటును గెలుచుకునేందుకు రూటు మార్చి చంద్రబాబు పక్కా ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టారన్నది స్పష్టమవుతోంది.