2019 ఎన్నికల్ల తర్వాత అసెంబ్లీలో  తాను , తన చుట్టూర  174 మంది తమ్ముళ్లు తప్ప మరొకరుండటానికి వీళ్లేదంటున్నారు నాయుడు గారు

ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ఆత్మవిశ్వాసం తో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. దీనితో భారత దేశంలో ఏ రాజకీయ నాయకుడికి ఇంతవరకు కలగని కోరిక కల్గుతూ ఉంది. ఆయన కోరిక ఏమంటే 2019లో తన కళ్ల ముందు ప్రతిపక్ష మనేది ఉండకూడదు. 

అంటే, అసెంబ్లీలో ఉండే 175 సీట్లను తెలుగుదేశం పార్టీయే గెలవాలి. అసెంబ్లీలో అటూఇటూ తమ్ముళ్లే కూర్చోవాలి (అంతా తమ్ముళ్లే కూర్చున్న సభ ఒక్కటే... కౌరవ సభ), అన్ని వైపుల నుంచి చప్పట్లు రావాలి. ఇది ఆయన కల.

ఈ విషయాన్ని అపుడపుడూ పరోక్షంగా చెబుతూ వస్తున్నారు. తాను చేస్తున్న కార్యక్రమాల వల్ల తాను చెయించుకుంటున్న సర్వేలలో మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన నమ్ముతున్నారు. ఈ రోజు తాజాగా ఇలా ప్రకటించారు.

‘‘అన్ని నియోజక వర్గాల్లో కార్యక్రమాలు చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మంచి నాయకత్వం ఉంటే 175 నియోజక వర్గాలు తెలుగుదేశం పార్టీకే తప్ప.. వేరే వాళ్లు గెలిచే అవకాశమే లేదు. అపోజిషన్ పార్టీలకు డిపాజిట్ రాకుండా బాధ్యతను నేతలు, కార్యకర్తలు చూసుకోవాలి. మీరు కోరిన విధంగా అభివృద్ధి నేను చేస్తాను,’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో పిలుపునిచ్చారు.

వైసిపి ఉప్పులేటి కల్పన చేరడంతో ఆయన ఉప్పొంగిపోయి తన మనసులో ఉన్న కోరికను ఈ విధంగా బయటపెట్టారు.