రిజర్వేషన్ల మధ్య ఇరుక్కుపోయిన చంద్రబాబు

రిజర్వేషన్ల మధ్య ఇరుక్కుపోయిన చంద్రబాబు

ఆచరణ సాధ్యం కాని కాపులకు రిజర్వేషన్ హామీలో చంద్రబాబునాయుడు ఇరుక్కుపోయారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు లేదని బిసి సామాజికవర్గం ఆందోళన చేస్తోంది. మరోవైపు అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా తమకు రిజర్వేషన్లు అమలు చేయటానికి కాపు సామాజికవర్గం మార్చి వరకూ చంద్రబాబుకు గడువిచ్చింది. సరే, ఈ రెండింటి విషయాన్ని పక్కనపెడితే, 50 శాతం దాటిన ఏ రిజర్వేషన్ను కూడా కేంద్రం అంగీకరించే ప్రశ్నలేదని ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించారు. దాంతో మూడు వైపుల నుండి కమ్ముకుంటున్న సమస్యలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్లపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎదురుచూస్తామని, అప్పటికీ రిజర్వేషన్లు అమలుకాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేయటం గమనార్హం. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ముద్రగడ ఆధ్వర్యంలో కాపు జేఏసీ కార్యాచరణ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు, పాల్గొన్నారు. కాపు జేఏసీ సమావేశం అనేక అంశాలపై చర్చించింది..

సమావేశం తర్వాత ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ 'పేద వారికి రిజర్వేషన్లు కావాలన్నది తన ఆశ’గా ముద్రగడ పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందాలంటే రిజర్వేషన్లు కచ్చితంగా ఉండాలన్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే, బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తగ్గించకూడదని మనవి చెప్పారు. అదే సమయంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ సరిపోదని 12 శాతం కావాలని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్ తగ్గించకుండానే కాపు రిజర్వేషన్లు అమలుచేయాలన్నది ప్రధాన డిమాండ్ గా చెప్పారు. ఏళ్ల తరబడి కోరుతున్నా కాపు రిజర్వేషన్లపై ముందడుగు పడటం లేదని, విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనంటూ పట్టుపట్టారు.  

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos