సిఎంతో పాటు కుమారుడు, కోడలు కూడా ఎప్పుడో మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మరి ఆ గ్రామాలు ఏ మేరకు అభివృద్ధి చెందాయో వారే వివరిస్తే బాగుంటుంది కదా?
చంద్రబాబు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. తమ గ్రామాలలో ప్రవాసభారతీయులు సేవలందించటమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. మరి, గతంలో కూడా ఇదే ఉద్దేశ్యంతో ప్రారంభించిన పథకాలు ఏమయ్యాయో తెలీదు. సంక్రాంతి వేడుకల సందర్భంగా చంద్రబాబు తన స్వగ్రామంలో మాట్లాడుతూ, ‘అమ్మ ఆంధ్రప్రదేశ్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ప్రవాసాంధ్రులు తమ జన్మభూమిని మరచిపోకుండా ఈ పథకాన్ని ఆరంభిస్తున్నారట. ప్రవాసభారతీయులు తమ జన్మభూమిని ఎన్నడూ మరచిపోకూడదని సిఎం పేర్కొన్నారు బాగానే ఉంది. ఇదే కాన్సెప్ట్ తో గ్రామాలను దత్తత తీసుకోవటం, అభివృద్ధి చేయటంపై గతంలో కూడా చంద్రబాబు పలు కార్యక్రమాలను ప్రారంభించారు. స్మార్ట్ విలేజ్ అన్నారు. స్మార్ట్ వార్డని చెప్పారు.
జన్మభూమి కార్యక్రమాల ఉద్దేశ్యమూ అదే కదా?. అయితే, వాటికి పెద్దగా రెస్పాన్స్ రాలేదేమో. ప్రవాసభారతీయులు తమ గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సహించే పేరుతో చంద్రబాబు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా విదేశాల్లో పర్యటించారు. అయినా పెద్దగా స్పందన కరువైంది. అయినా ఎవరినో గ్రామాలను దత్తత తీసుకోమనేకన్నా ఎంఎల్ఏ, ఎంపిలు, మంత్రులున్నారు కదాా ? వారినే దత్తత తీసుకుని అభివృద్ది చేయమని చెప్పవచ్చు కదా?
దాంతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటి (సిఎస్ఆర్)క్రింద ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా గ్రామాలను దత్తత తీసుకోవాలని, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ సిఎం పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఉపయోగం కనబడలేదు. దాంతో తాజాగా ‘అమ్మ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమాన్ని రూపొందించటం విశేషం. మరి ఇదెంత వరకూ సక్సెస్ అవుతుందో ఏమో. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, సిఎంతో పాటు కుమారుడు, కోడలు కూడా ఎప్పుడో మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మరి ఆ గ్రామాలు ఏ మేరకు అభివృద్ధి చెందాయో వారే వివరిస్తే బాగుంటుంది కదా?
