కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన నాగ వైష్ణవి ఫ్యామిలీ
విజయవాడ: ఎనిమిదేళ్ళ క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి హత్య కేసులో నిందితులకు కోర్టు జీవితఖైదు విధించడంపై నాగ వైష్ణవి సోదరుడు హరీష్ స్పందించారు. ఈ తీర్పు ఇంకా ముందే వచ్చి ఉంటే తమ కుటుంబానికి చెందిన వారు ఎంతో సంతోషంగా ఉండేవారని ఆయన చెప్పారు. నిందితులకు కఠినంగా శిక్షపడాలని మా అమ్మ కోరుకొనేదని ఆయన అభిప్రాయపడ్డారు.
నాగవైష్ణవి హత్య కేసు తీర్పు వెలువడిన తర్వాత గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పు కోసం తమ కుటుంబసభ్యులు చాలా కాలంగా ఎదురుచూశారని ఆయన చెప్పారు. ఈ కేసు విషయమై తమకు ఎందరో స్వచ్చంధంగా సహకారాన్ని అందించారని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఈ తీర్పు ఇంకా రెండేళ్ళ ముందే వచ్చి ఉంటే తమ కుటుంబసభ్యులు ఇంకా సంతోషంగా ఉండేవారని ఆయన చెప్పారు.
కానీ ఈ తీర్పు కోసం ఎదురుచూసిన వారు ప్రస్తుతం ప్రాణాలతో బతికిలేరని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. ఈ తీర్పు రెండేళ్ళ క్రితమే వచ్చి ఉంటే ఇంకా ఎందరో సంతోషంతో ఉండేవారని ఆయన అభిప్రాయపడ్డారు.
తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరోకరికి జరగకుండా ఉండాలనేదే తమ తల్లి కోరికగా ఉండేదన్నారు. అంతేకాదు నాగవైష్ణవిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె కోరుకొనేదని ఆయన గుర్తు చేసుకొన్నారు. పాత విషయాలను నెమరేసుకొంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
