హైదరాబాద్: తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిగ్రీపై సినీ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై అసక్తికరమైన చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ ఐటి డిగ్రీ హోల్డర్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే, పవన్ కల్యాణ్ చెప్పిన మాటలతో వాటికి పొంతన లేదు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్ చదువుపై కూడా వివరించారు. 

తన యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా విద్యార్థులకు, వారి తల్లదండ్రులకు నాగబాబు ఓ సందేశాన్ని ఇచ్చారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయితే ఎందుకూ పనికి రాని వారిగా క్రియేట్‌ చేస్తున్నారని ఆయన అన్నారు. తల్లిదండ్రులపై, వ్యాపారంగా మారిన విద్యావిధానంపై ఆయన విరుచుకుపడ్డారు.

చిరంజీవి డిగ్రీ పూర్తి చేశారని, ఇద్దరు సిస్టర్స్‌లో ఒకరు ఎంబీబీఎస్‌, మరోకరు డిగ్రీ పూర్తి చేశారని, పవన్‌ కల్యాణ్‌ ఇంటర్‌ తరువాత ఐటీలో డిగ్రీ హోల్డర్‌ అని ఆయన చెప్పారు. ఏనాడు కూడా తమ తల్లిదండ్రులు చదువు విషయంలో ఒత్తిడి చేయలేదని అన్నారు. 

ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో తన విద్యాభ్యాసంపై పవన్ కల్యాణ్ ఒక్కో విధంగా చెప్పారు. గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తాను పదోతరగతి పూర్తి చేసినట్లు నమోదు చేశారు. అయితే గతంలో నెల్లూరులోని ఓ ఇంటర్మీడియట్‌ కాలేజీలో రికమెండేషన్‌తో సీఈసీ తీసుకున్నానని ఓ చెప్పారు. వేరే గత్యంతరం లేక ఎమ్‌ఈసీ తీసుకున్నానని మరో సభలో చెప్పారు. స్నేహితులతో కలిసి ఎంపీసీ ట్యూషన్‌​కు వెళ్లానని మరో సభలో చెప్పారు. పరస్పర విరుద్ధమైన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తన చానెల్ లో నాగబాబు మరీ ఆసక్తికరమైన మాటలు చెప్పారు. "ఐ క్లియర్డ్‌ మై ఎల్‌ఎల్‌బీ.. మద్రాసు బార్‌ కౌన్సిల్‌లో రిజిష్టర్‌ చేయించాను. చిరంజీవి గారు డిగ్రీ పాస్‌ అయ్యారు. ఇద్దరు చెల్లెల్లో ఒక చెల్లి ఎంబీబీఎస్‌, మరో చెల్లి డిగ్రీ చదివింది. కల్యాణ్‌ బాబేమో అదర్‌ దెన్‌ హిజ్‌ ఇంటర్మీడియట్‌.. తను కొన్ని ఐటీ సబ్జెక్ట్స్‌ పూర్తి చేసి.. ఐటీ డిగ్రీ హోల్డర్‌ అతను" అని నాగబాబు వివరించారు.