విజయవాడ: కరోనా విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు జీతాలు ఇవ్వకపోతే ఎలా? అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండు నెలల నుంచి వారికి జీతాలు చెల్లించకపోవడం ప్రభుత్వ వైఫ్యలమేనని అన్నారు. తక్షణమే వైద్యారోగ్య సిబ్బందికి బకాయిలతో పాటు ఒక నెల జీతం అడ్వాన్స్ గా ఇవ్వాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. 

''కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజురోజుకీ విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటం దురదృష్టకరం. కోవిడ్-19 విధుల కోసం నియమించుకున్న మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ వైద్యులు, స్టాఫ్ నర్సులతో పాటు ఇతర సిబ్బందికి గత రెండు నెలలకు జీతాలు చెల్లించడం లేదు'' అని ఆరోపించారు. 

''కరోనా అంటే ప్రతి ఒక్కరూ భయపడిపోతున్న సమయంలో ఎంతో ధైర్యంగా వృత్తిపట్ల నిబద్ధతతో విధులకు వచ్చినవారికి కనీసం జీతం కూడా ఇవ్వకపోవడం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ఎక్కడెక్కడో కరోనా విధులకు వారిని నియమిస్తే ఆ ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు చెల్లించుకొంటూ ఆహార, నిత్యావసరాలకు వారు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యయప్రయాసలను ఓర్చుకొంటూ ప్రాణాలను సైతం లెక్కించకుండా ఎంతో గుండె ధైర్యంతో విధులు చేపడుతున్నారు. నెలవారీ జీతం చెల్లింపులకూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ దృష్టికి ఇప్పటికే ఈ సమస్య చేరింది. కొద్ది నెలల కిందట కోవిడ్ విధుల్లోనే ఉన్న మెడికోలకు స్టైఫండ్ ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేసినప్పుడు పవన్ కల్యాణ్ స్పందించాక ఆ మొత్తాలు విడుదల చేశారు'' అని అన్నారు. 

 వైద్య సిబ్బందికేదీ గౌరవం: 

''కరోనా విధుల కోసమే 1170 మంది స్పెషలిస్ట్ వైద్యులను, 1170 మంది మెడికల్ ఆఫీసర్లను, 2వేలమంది నర్సులను, 1200కి పైగా పారా మెడికల్, ఇతర సిబ్బందిని ప్రభుత్వం నియమించుకొంది. అదే విధంగా 1700 మంది ఆరోగ్య కార్యకర్తలకీ జీతాలు అందటం లేదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికీ రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేయడాన్ని జనసేన పార్టీ ఖండిస్తుంది'' అని మండిపడ్డారు.

read more  ఫిబ్రవరిలోపు అంతర్వేదిలో రథం నిర్మాణం : రూపురేఖలు ఇవీ....

''కరోనా విధుల్లో ఉన్న వైద్యులు, ఇతర సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరినే అవలంభిస్తుంది. వారికి గౌరవమర్యాదలు ఇవ్వడం లేదు. తగిన విధంగా పిపిఈ కిట్లు,  కనీసం గ్లౌజులూ, శానిటైజర్లు, మాస్కులు ఇవ్వడం లేదని వైద్యులు, నర్సులు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. డా.సుధాకర్ ఉదంతం ఇందుకు సంబంధించినదే'' అని అన్నారు. 

''తెనాలిలో సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు అని తెలియగానే జనసేన వారికి అవసరమైన శానిటైజర్లు, కిట్లు అందచేసింది. నాదెండ్ల పి.హెచ్.సి.లోని వైద్యుడు తమ సమస్యను చెబితే అరెస్ట్ చేయమని కలెక్టర్ ఆదేశించడం ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి చర్యలు వైద్య సిబ్బంది మనోస్థైర్యాన్ని దెబ్బ తీస్తాయి. కరోనా విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి తక్షణమే బకాయి ఉన్న జీతాలు చెల్లించాలి. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఉన్నత స్థాయి వైద్య అధికారి నుంచి ఔట్ సోర్సింగ్ సిబ్బంది వరకూ అందరికీ ఒక నెల జీతం అడ్వాన్స్ గా చెల్లించాలని ప్రభుత్వానికి జనసేన సూచిస్తుంది'' అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.