ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు నగరంలో అంతు చిక్కని వ్యాధి వణుకు పుట్టిస్తోంది. నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ వ్యాధి కారణంగా ఓ వ్యక్తి మృత్యువాత పడడంతో ప్రజలు మరింతగా భయాందోళనలకు గురవుతున్నారు. మూర్ఛ వచ్చి స్పృహ తప్పి ప్రజలు పడిపోతున్నారు. దానికి కారణమేమిటనేది వైద్యులు ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. 

తాజాగా సోమవారం తెల్లవారు జాము నుంచి మరో 70 మంది వింత వ్యాధితో ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో ఈ వింత వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య 350కి చేరుకుంది. వైద్యులు రక్త నమూనాలను సేకరించి పరీక్షించారు. అందులో ఏ విధమైన లోపాలు కూడా కనిపించలేదు.

Also Read: ఏలూరులో మూర్ఛపోతున్న ప్రజలు.. కిషన్ రెడ్డి ఆరా

ఈ వ్యాధికి ఆర్గోనో క్లోరైన్ కారణం కావచ్చునని భావిస్తున్నారు. రేపు ఐస్ఐఎస్, ఐఐసిటీ బృందాలు ఏలూరు వస్తున్నాయి. ఏలూరులోని 22 ప్రాంతాల్లో నీటి శాంపిల్స్ సేకరించారు. 52 రక్త నమూనాలను, 9 ప్రాంతాల్లో పాల నమూనాలను సేకరించారు. వాటిలో ఏ విధమైన లోపాలు కనిపించలేదని తెలుస్తోంది. ఈ- కోలీ టెస్టు ఫలితాలు వస్తే కారణం తెలిసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 

Also Read: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి: తొలి మరణం

42 మందికి బ్రెయిన్ సీటీ స్కాన్ కూడా తీశారు. వెన్నెముక నుంచి తీసుకున్న శాంపిల్స్ ను సేకరించారు. ఆ పరీక్షల ఫలితాల్లో కూడా ఏమీ తేలలేదు. నార్మల్ గానే ఉన్నట్లు తేలింది. అయితే, ముందు జాగ్రత్తగా మున్సిపల్ వాటర్ తాగవద్దని అధికారులు ఆదేశించారు. 

మంగళగిరి నుంచి ఎయిమ్స్ బృందం వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఉదయం 9 గంటలకు ఏలూరు వస్తున్నారు. ఆయన బాధితులను పరామర్శిస్తారు. వింత వ్యాధిపై అధికారులతో సమీక్ష జరుపుతారు.