పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో పలువురు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొలి మరణం సంభవించింది. విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ (45) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.

మూర్చతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. ఈ ఉదయం ఆస్పత్రిలో చేరాడు. అయితే వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వల్లే శ్రీధర్‌ మృతిచెందారంటూ అతడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నా మెరుగైన చికిత్స కోసం వైద్యులు విజయవాడ తరలించలేదని శ్రీధర్ ఆరోపిస్తున్నారు. మరోవైపు శ్రీధర్‌ మృతిని వైద్యులు ఇంకా ధ్రువీకరించలేదు.    

కాగా అస్వస్థతకు గురై ఇప్పటివరకు సుమారు 300 మంది ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 117 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. సాయంత్రం వరకు అందరి ఆరోగ్య పరిస్థితీ నిలకడగానే ఉన్న నేపథ్యంలో మూర్చ వ్యాధిలో ఆస్ప్రతిలో చేరిన శ్రీధర్‌ మృతి చెందడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు.

అస్వస్థతకు గల కారణాలను ఇప్పటివరకు అధికారులు, వైద్యులు నిర్థారించలేకపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్ బృందం ఏలూరుకు చేరుకుంది .

బాధితుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి విజయవాడకు పంపారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఏలూరులో పర్యటించి వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.