వింత వ్యాధులతో వరుస మరణాలు మన్యంలో కలకలం రేపుతున్నాయి. బాహ్య ప్రపంచానికి దూరంగా మన్యంవాసులు ఉండడం వల్ల ఈ మరణాల విషయం ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. 

2019లో పాచిపెంట మండలం చిల్లమామిడిలో వింత వ్యాధితో పదిమంది మృతి చెందగా, అదే గ్రామంలో 2020 నవంబరులోనూ వరుస మరణాలు సంభవించాయి. మెలియాకంచూరు పంచాయతీ ధూళిభద్రలోనూ వింత వ్యాధి గిరిజనుల ప్రాణాలను తీసేసింది. ప్రస్తుతం కంకణాపల్లిని చుట్టేస్తోంది. 

గతేడాది నవంబరులో చిల్లమామిడిలో ఒళ్లు పొంగులు, పచ్చకామెర్లు, తీవ్ర జ్వరాలతో ఆరుగురు మృతి చెందారు. అనంతరం అధికారులు గ్రామాన్ని సందర్శించి 147 మందికి వైద్య పరీక్షలు చేయించి విశాఖ కేజీహెచ్, నెల్లిమర్ల మిమ్స్ కు తరలించారు. ఆ గ్రామంలో ప్రజలు తాగుతున్న నీటిని పరీక్షించారు. ఆహారం, మడ్డికల్లు నమూనాలు కూడా సేకరించారు. 
అయితే ఇప్పటివరకు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? వింత వ్యాధికి కారణం ఏమిటి? అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. దీనిమీద డిప్యూటీ డీఎంహెచ్వో రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ పరీక్షల్లో ఎవరికీ ఎలాంటి సమస్యలేదని నివేది వచ్చినట్లు తెలిపారు. అంతేకాదు పెద్ద వయసు వారు, అతిగా మద్యం తాగిన వారు మరణిస్తే వింత వ్యాధిగా పరిగణిస్తున్నారని చెప్పారు. 

అయితే  ‘మేం ఏం పాపం చేశాం. వింత రోగంతో ఎప్పుడు, ఎవరు చనిపోతున్నారో.. తెలియడంలేదు ఒకరా, ఇద్దరా వృద్ధులు, యువకులు అని తేడా లేకుండా వరుసగా పదిమంది మరణించారు. మాకే ఎందుకీ శిక్ష అంటూ..’ కంకణాపల్లి గ్రామస్తులు అధికారుల ముందు కన్నీరు పెట్టుకున్నారు.

కేవలం 50 కుటుంబాలు మాత్రమే ఉన్న గ్రామంలో వరుస మరణాలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నెల 17న మరణించిన రామకృష్ణ (21) పచ్చకామెర్లతో మృతి చెంది ఉంటాడని వైద్యులు నిర్ధారించగా, మడ్డికల్లు, నాటుసారా, కలుషిత నీరుతోనే మరణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మందిలో వాపులు ఉన్నట్లు చెబుతున్నారు.

మా గ్రామంలో సరైన తాగునీటి వసతి లేదు. ఏడాదిగా మంచినీటి పథకం పనిచేయడం లేదు. గ్రామ శివారులోని రెండు పాడుబడిన బావుల్లోని నీటినే తాగుతున్నాం. వాడుక నీరు, మురుగు ఈ బావుల్లో చేరి నీరు కలుషితమవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఒకతను మాట్లాడుతూ అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న మా కొడుకు పొలం పనికి వెళ్లొచ్చి కడుపునొప్పి అని అన్నాడు. తెల్లారి ఆస్పత్రికి తీసుకెల్తుంటే మధ్యలోనే చనిపోయాడని వాపోయాడు. గతేడాది సెప్టెంబర్ లో ముగ్గురు, అంతకు ముందు కూడా కొందరు ఇలాగే చనిపోయారని తెలిపాడు. 

మన్యంలో మరణాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. వైద్యులతో సమావేవం నిర్వహించాం. ప్రతి గ్రామంలోనూ నెలకోసారి వైద్య శిభిరం ఏర్పాటు చేసి గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించాం. కంకణాపల్లిలో వారం పాటు వైద్య శిబిరాలు కొనసాగిస్తాం అని ఐటీడీఏ పీవో కూర్మనాథ్ తెలిపారు.