కేవలం వంద రూపాయల కోసం ఓ యువకుడిపై ఇద్దరు దుండగులు కత్తులతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.
విజయవాడ : ఐదు పది రూపాయలకు మనుషుల ప్రాణాలు తీసే కిరాతకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కాసుల కోసం కసాయిలో దారుణాలకు పాల్పడుతున్నారు.ఇలా కేవలం వంద రూపాయలు ఇవ్వలేదని ఓ యువకుడిపై కత్తులతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు గుర్తుతెలియని దుండగులు. ఈ దారుణం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో చోటుచేసుకుంది. ఈ ఘటన విజయవాడ వాసులను భయాందోళనకు గురిచేస్తోంది.
విజయవాడ మాచవరంలోని ఓ సెలూన్ లో బార్బర్ గా పనిచేసే బోగిల హరిప్రసాద్ కస్తూరి బాయ్ పేటలోని ఓ హాస్టల్లో వుంటున్నాడు. ఇవాళ మంగళవారం కావడంతో సెలూన్ తెరవకపోవడంలో తెల్లవారుజామునే వెళ్ళిపోయే హరిప్రసాద్ హాస్టల్లోనే వున్నాడు. ఈ క్రమంలోనే ఉదయం హాస్టల్ నుండి బయటకు వచ్చిన అతడు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు.
రూ.100 ఇవ్వాలని మాస్కులు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు హరిప్రసాద్ అడిగారు. అతడు ఇవ్వకపోవడంతో వెంటతెచ్చుకున్న పదునైన కత్తులతో హరిప్రసాద్ ను విచక్షణారహితంగా పొడిచారు. నడి రోడ్డుపైనే ఇందంతా జరుగుతున్నా దుండగులను ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో హరిప్రసాద్ పడిపోగానే దుండగులు అక్కడి నుండి పరారయ్యారు.
Read More పెడనలో దారుణం: మహిళపై యాసిడ్ దాడి, ఆసుపత్రికి తరలింపు
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన హరిప్రసాద్ ను జిజిహెచ్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ హత్యాయత్నంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేవలం వంద రూపాయల కోసమే ఈ హత్యాయత్నం జరిగిందా లేక మరేదైన కారణం వుందా అన్నకోణంలో పోలీసులు విచారణ సాగుతోంది. ఘటన జరిగిన ప్రాంతంలో సిసి కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నించారు.
