కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎవరో అదృశ్యశక్తి వెనక నుంచి ఈ తలనొప్పులు తెప్పిస్తున్నారని తనలాంటివారికి అనుమానం కలుగుతోందని ఆయన ఆ లేఖలో అన్నారు. ముద్రగడ ఆ అదృశ్య శక్తి పేరు చెప్పలేదు.  అయితే, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ముద్రగడ అన్నట్లు అర్థమవుతోంది.

రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ఎన్నికలు నిర్వహించాలని ఆయన నిమ్మగడ్డకు సూచించారు. పట్టుదలకు వెల్లి ప్రజల ఖజానాను కొల్లగొట్టవద్దని ఆయన చెప్పారు. మద్యం, డబ్బు లేకుండా ఏ అధికారి అయినా ఎన్నికలు నిర్వహించగలరా అని ఆయన అడిగారు. 

ఈ మధ్య రాష్ట్రప్రభుత్వంపై మీరు చేస్తున్న దాడిని మీడియా ద్వారా చూస్తున్నానని అంటూ దానికి ఆయన విచారం వ్యక్తం చేశారు. ఎననికలు అన్నవి రాష్ట్రంలో పరిస్థితిని బట్టి నిర్వహించడానికి తమరు ప్రయత్నం చేయాలి గానీ రాజకీయ నాయకులలాగా పట్టుదలకు వెళ్లడం మంచిగా లేదని ఆయన అన్నారు. 

గతంలో ఎన్టీార్ చిత్రం నేరం నాది కాదు.. ఆకలిది అన్నట్లుగా మిమ్మల్ని ఎవరో అదృశ్య శక్తి వెనక నుంచి ఈ తలనొప్పులు ఇప్పిస్తున్నారని తనలాంటివారికి అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. మీరు ఉద్యోగస్తులు, చాలా పెద్ద చదువు చదువుకుని, పెద్ద హోదాలో ఉన్నారని, ఉద్యోగంలో ఉంటూ రాజకీయం చేయడం మంచిగా లేదని ఆయన అన్నారు. 

మీ తగాదాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలని, అవకాశం ఉంటే సలహాలు ఇవ్వాలని, రచ్చ చేయడం మానాలని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితి మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి చూస్తున్నామన ి, మీకున్న విశిష్ట అధికారాలతో సంస్కరణలు తీసుకుని వచ్చి సమాజంలో మార్పు తేవాలని ఆయన అన్నారు. 

ఎన్నికలు నిర్వహించే అధికారులు గుండె మీద చేయి వేసుకుని లిక్కరు, డబ్బు లేకుండా ఎన్నికలు నిర్వహించామని చెప్పగలరా అని ముద్రగడ నిమ్మగడ్డను ప్రశ్నించారు. వాటిపై ఏ అధికారి కూడా దృష్టి పెట్టడని, ప్రకటనల వరకే మీరందూరు పనిచేస్తున్నారు తప్ప లోతుగా ఆలోచించి ఏ చర్యలు కూడా తీసుకోరని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం , తమరు పట్టుదలతో తగవులు పడి గౌరవ న్యాయస్తానాల్లో వాదించడానికి న్యాయవాదులను నియమించుకోవడానికి మీరు ఇరువురు కూడా ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారని ఆయన విమర్శించారు. ఆ ఖజానాలో డబ్బు ప్రజల కష్టార్జితంతో కట్టిన పన్నులు అనే సంగతి మరిచిపోకూడదని ఆయన సలహా ఇచ్చారు. 

ఖజానాలో ఉ్న డబ్బుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని గాని పంతాలూ పట్టింపులకు కాదనే సంగతి తమరికి తెలియంది కాదని ఆయన అన్నారు. ఒక బాధ్యత గల పౌరుడిగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత తనవంటి వాడిపై ఉందని అనుకుని ఈ లేఖ రాస్తున్నట్లు ముద్రగడ నిమ్మగడ్డకు రాసిన లేఖలో అన్నారు.