అమరావతి: కాపు ఉద్యమం  తిరిగి నడపాలనే డిమాండ్ ను మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంగీకరించలేదు. కాపు ఉద్యమ నేతల సమావేశం తర్వాత ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు.తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో 13 జిల్లాలకు చెందిన  కాపు జేఏసీ నేతలు ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు.

కాపు ఉద్యమం గురించి చర్చించారు. అరగంటకుపైగా కాపు జేఏసీ నేతలు పలు అంశాలపై చర్చించారు. కాపు ఉద్యమ నేతగా  తాను తప్పుకొంటున్నట్టుగా కొద్దిరోజుల క్రితమే ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. 

ఇవాళ ఉద్యమ నాయకులకు కూడ అదే విషయాన్ని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. ఈ సమావేశం తర్వాత ఆయన పత్రిక ప్రకటనను విడుదల చేశారు.

తిరిగి కాపు ఉద్యమాన్ని నడపాలనే మీ కోరికను అంగీకరించలేకపోతున్నానని ఆయన ప్రకటించారు. వ్యక్తిగతంగా మీతోనే ఉంటానని ఆయన చెప్పారు.దయచేసి తనను ఎవరూ కూడ ఇబ్బందిపెట్టొద్దని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీలో జగన్ సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత  కొద్ది రోజుల క్రితం కాపు ఉద్యమ నేతగా తప్పుకొంటున్నట్టుగా ఆయన ప్రకటన చేశారు.

రానున్న రోజుల్లో కాపుల రిజర్వేషన్లు ఇతర అంశాలపై  ముద్రగడ పద్మనాభం స్థానంలో ఎవరిని నాయకుడిగా ఎన్నుకొంటారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే ఈ విషయమై కాపు జేఎసీ నేతల నుండి  స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.