ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి  కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. మరోసారి లేఖ రాశారు. గత ఎన్నికల సమయంలో కాపులకు రిజర్వేషన్లు కలిపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు చంద్రబాబుకి లేఖలు రాసిన ముద్రగడ మరోసారి లేఖ రాశారు. ఆ లేఖలో ఏ ముందంటే..

‘‘ నేను మీ అంతటి మేధావిని కాను, పెద్దగా చదువుకోలేదు కానీ మీరు మాజాతికి ఇచ్చిన హామీ అమలుకు చుక్కలు చూపడం చూస్తా ఉంటే మీ సీనియార్టీ ఏమైపోయింది? పక్కన మహారాష్ట్ర నేతకీ మీ అంత వయస్సు లేదు, అంత సీనియర్ కాదనుకుంటాను. వారు ప్రజలకు ఇచ్చిన హామీకి బద్దులై చిత్త శుద్దితో మరాఠాలకు ఇచ్చిన హామీ కోసం పడ్డ తపన అంతా ఇంతా కాదని అనిపిస్తోంది. ఇలాంటి తపనతోనే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత గారు చేయడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. 2018 డిసెంబర్ లేక  2019 జనవరి నుంచి మరాఠాలకు బీసీ రిజర్వేషన్ 16శాతం అమలు చేయడానికి తీసుకున్నచర్యలు తమరి దృష్టికి రాకపోవడం మా జాతి చేసుకున్న పాపమా? మా పై కోపమా? మమ్ములను పాతి పెట్టాలనే ప్రయత్నమా? ఏమిటీ దారుణం? శలవిస్తారా?

మా జాతికి బీసీ రిజర్వేషన్ కోసం 2017 డిసెంబర్ లో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఢిల్లీలో తోసేసి చేతులు దులుపుకున్నారు. మహారాష్ట్ర సీఎం చేసినట్లుగా ఎందుకు చేయలేకపోయారు?చేతకాదా? చేయాలని లేదా? మా జాతి మీ వద్ద బానిసలుగానే బతకాలి, మీకు రిజర్వేషన్ ఇవ్వను అని స్పష్టంగా ప్రకటన చేయండి. మా దారి మేము చూసుకుంటాం.

ముఖ్యమంత్రి  గారు మరొక విషయం ఆ మధ్య మహారాష్ట్ర లో వేలాది రైతులు వారి సమస్యలు చెప్పుకోవడానికి 5 రోజులు పాదయాత్ర చేసి ముంబయి చేరుకున్న క్రమంలో మంత్రిగారు ఎదురెళ్లి స్వాగతం పలికారు. వారి సమస్యలు ముఖ్యమంత్రి గారు విని , భోజనం ఏర్పాట్లు చేసి, వారందరినీ ఇండ్లకు పంపండానికి ప్రత్యేక రైల్లు, బస్సులు ఏర్పాటు చేయించి పంపించిన ఘనత దేశ చరిత్రలో ఎవరూ పొందలేదు. పొందలేరు కూడా అవునా? కాదా?

అటువంటి సంఘటన మీ పాలనలో ఒక్కటైనా ఉన్నదా ? మీకు ఇటువంటివి చేతకాదు, పోలీసులు ఉక్కు పాదాలతోనూ, తుపాకులతోనూ ఉద్యమాలను అణచివేయడం మాత్రమే తెలుసు.
ఈ రాష్ట్రంలోనే మా జాతి పుట్టింది. ఏ ఇతర దేశం నుంచో వలస వచ్చినవారము కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరితోపాటు మాకు అన్ని సదుపాయాలు పొందే అర్హత ఉంది. ఏదో మీ సొంత ఆస్తి దానం చేసినట్లుగా రోడ్లు వేశాను, మరుగుదొడ్డి కట్టించాను,. చంద్రన్న కళ్యాణ మండపాలు కట్టిస్తున్నాను అని సొల్లు కార్చుతూ  ఉపన్యాసాలు ఇవ్వకండి. ఇక ఆ సొల్లు ఆపండి. ప్రజలు అంత అమాయకులేమీ కాదన్న సంగతి గ్రహించండి. మా జాతికి అన్నం పెట్టకుండా కూర, పచ్చడి, సాంబారు, మీ హెరిటేజ్ కోలెస్ట్రాలోని మజ్జగ, ఇచ్చినట్లుగా తరచూ చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా మంత్రిగారు. మీరిచ్చిన హామీ అమలు కోసం రోడ్డు మీద బతకాలా చెప్పండయ్య మీకో నమస్కారం పెడతాము

మీ పదవి ఆకలి తీర్చుకోవడానికి మా జాతి ఆకలి తీరుస్తానన్నారు. మీది, మీ పుత్రరత్నం గారి ఆకలి తీరింది కదా.. మా ఆకలి తీర్చడానికి అమెరికా, సింగపూర్ అధ్యక్షుల పర్మిషన్ కావాలా? మా జాతి సమస్య అడుగుతుంటే మీ నోటి వెంట ఒక మాట రాదు. అలా అడిగినదానికి సమాధానం చెప్పకుండా మౌనం వహిస్తే మేధావిని అనుకుంటున్నారేమో సరే, మీరే మేధావిని అని అనుకోకండి. త్వరలో జరగబోయే ఎన్నికల కురక్షేత్ర యుద్ధంలో ఎందరు మీ తరపున మహాకూటమి నాయకులు వచ్చినా సరైన సమాధానం చెప్పి తీరుతాం. అప్పుడు మీ మౌనాలు ఏమీ పనిచేయవు మీకు నిశ్శబ్దమే మిగులుతుంది ముఖ్యమంత్రి గారు. మీ పతనాన్ని ఏ శక్తి ఆపజాలదు. మిమ్మల్ని, మీ పార్టీని కౌరవుల స్థితికి చేర్చడం తథ్యం తథ్యం’’ అని పద్మనాభం లేఖలో పేర్కొన్నారు.