కర్నూలు కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని అంటున్నారు హోం మంత్రి చిన్న రాజప్ప
కాపు రిజర్వేషన్ పోరాటనాయకుడు ముద్ర గడ పద్మనాభం శాంతి భద్రతలు భగ్న పరిచే వ్యక్తిగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ మేరకు ఆయన పేరు ప్రకటించ లేదు గాని,అప్రటితంగా ఆయన కార్యక్రమాల మీద ఇక ముందు నిర్భంధం కొనసాగిస్తారు. కిర్లంపూడిలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమంలో ఆయన పాల్గొనకుండా కట్టుదిట్టం చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ నెల 26 న కర్నూలులో జరిగే కాపు సత్యాగ్రహాన్ని అడ్డుకోవాలనుకుంటున్నారు. దీనికోసం కర్నూలు కాపు నిరసన కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని చెప్పేశారు.
ముద్రగడ కర్నూలు పర్యటనను అడ్డుకునేందుకు చర్యలు మొదలుపెట్టింది. హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప స్వయంగా వివరణ ఇస్తూ కర్నూలు కాపు సత్యాగ్రహానికి అనుమతి లేదని అందువల్ల జరగనీయమని స్పష్టం చేశారు.
‘ఈ నెల 26న కర్నూలులో దీక్ష నిర్వహించాలంటే పోలీస్ శాఖ అనుమతులు తప్పనిసరి,’ అని కృష్ణా జిల్లా జైలు, జైళ్ల శాఖ డిజి కార్యాలయాల అధునికీకరణ కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన వివరణ ఇచ్చారు.
‘శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన జరిగి అభివృద్ధి సాధ్యం. ముద్రగడ దీక్షయినా మరే ఇతర కార్యక్రమాలైనా ప్రజలకు ఇబ్బంది లేనంత వరకు పోలీసులు అనుమతిస్తారు. గొడవలు చేస్తూ ఇబ్బందులు కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోరు,’ అని హెచ్చరించారు.
‘ముద్రగడ తన దీక్షకు అనుమతి కావాలని దరఖాస్తు చేస్తే నిబంధనల ప్రకారం పరిశీలించి అనుమతులు ఇస్తాం. అనుమతి కోసం ముద్రగడ లెటరే ఇవ్వరు,’ అని చెబుతూ ప్రతి పక్షాలు, ప్రజా సంఘాల ర్యాలీలను ప్రభుత్వం అడ్డుకుంటున్నదన్న ఆరోపణలను చిన్న రాజప్ప తోసిపుచ్చారు.
‘ప్రతి పక్ష నేత జగన్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు. వాటిని అవన్నీ తాము అడ్డుకుంటున్నామా? రిపబ్లిక్ డే, సిఐఐ సదస్సు నిర్వహించే రోజుల్లో ఉద్దేశపూర్వకంగా యువతను రెచ్చగొడితున్నందుకే ఆయనను విశాఖ ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాటిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాటిని మాత్రమే పోలీసులు అనుమతించడలేదు.
వైసిపి ఎమ్మెల్యే రోజాను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు నిర్బంధించడాని కారణం-. మహిళా ప్రతినిధులతో పార్లమెంటేరి యన్ల సదస్సు సాగుతుంటే అక్కడ గందరగోళం సృష్టించనుందని సమాచారం ఉండటమే,’అని ఆయన అన్నారు.
