Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ సెకండ్ లిస్ట్ పై ముద్రగడ ఎఫెక్ట్.. అందుకే ఆలస్యమవుతోందా?..

వైసీపీతో ముద్రగడ చర్చల్లో తన కుమారుడికి పిఠాపురం టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు. కాగా, వైసీపీ అధిష్టానం మాత్రం ముద్రగడను కాకినాడ  లోకసభ స్థానంలో నిలబెట్టాలని యోచిస్తుంది. కానీ, ముద్రగడ పద్మనాభం తనతో పాటు, తన కుమారుడు గిరిబాబుకు టికెట్ ఇవ్వమని కోరుతున్నారు. 

Mudragada effect on YCP second list, is that why it is delayed? - bsb
Author
First Published Jan 1, 2024, 1:29 PM IST

అమరావతి : ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం చర్చనీయాంశంగా మారారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తాను రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండబోతున్నట్లు సంకేతాలు పంపుతున్నారు. ముద్రగడ వైసీపీలో చేరడానికి అంతా సిద్ధం అయినట్లుగా సమాచారం. ముద్రగడ చేరిక కోసమే వైసీపీ రెండో జాబితా ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అభ్యర్థులతో కూడిన ఓ జాబితాను తయారు చేసింది. 

అయితే, గతవారమే ప్రకటించాల్సిన ఈ జాబితా విడుదల ఆలస్యం అవుతోంది. దీనికి కారణం ముద్రగడ చేరిక అని తెలుస్తోంది. వైసీపీతో ముద్రగడ చర్చల్లో తన కుమారుడికి పిఠాపురం టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు. కాగా, వైసీపీ అధిష్టానం మాత్రం ముద్రగడను కాకినాడ  లోకసభ స్థానంలో నిలబెట్టాలని యోచిస్తుంది. కానీ, ముద్రగడ పద్మనాభం తనతో పాటు, తన కుమారుడు గిరిబాబుకు టికెట్ ఇవ్వమని కోరుతున్నారు. వైసీపీ అధిష్టానం ఒక్కరికి అదికూడా ముద్రగడకు లోక్ సభ టికెట్ మాత్రమే ఇవ్వడానికి మొగ్గు చూపుతోంది.

వైఎస్ షర్మిల కొడుకు పెళ్ళి.. వైరల్ అవుతున్న ట్వీట్..

ఈ నేపథ్యంలోనే వైసీపీ ఇంచార్జి ల మార్పు జాబితా ఆలస్యం అవుతోంది. ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరితే.. పలు స్థానాల్లో మళ్లీ మార్పులు జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు మరికొంతమంది పార్టీలో చేరే అవకాశం ఉండటంతో దీనిమీద అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ చేరికల తరువాతే రెండో జాబితా ప్రకటించే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారు. 

నేడు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లుగా ఇలాంటి కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఈ సమ్మేళనం అనంతరం వైసీపీలో చేరబోయే అంశం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ముద్రగడ చిన్న కొడుకు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సారి ముద్రగడ పద్మనాభం ఏదో ఒక పార్టీలో ఖచ్చితంగా చేరతారని తెలిపారు. అయితే, అది ఏ పార్టి అనేది నాన్నే చెబుతారని చెప్పుకొచ్చారు. ఒకవేళ తండ్రి ఆదేశిస్తే తాను కూడా ఏదో ఒక పార్టీలో చేరతానని చెప్పారు. 

కాగా, పవన్ కల్యాణ్ గతంలో ముద్రగడ మీద తీవ్ర విమర్శలు చేశారు. కాపుఉద్యమాన్ని కొందరు స్వార్థానికి వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంది జనసేన. ఈ రెండు కారణాలతో ఆయన జనసేనకు దగ్గరయ్యే అవకాశం లేదు. టీడీపీకి వ్యతిరేకమే కాబట్టి ఆ పార్టీలో చేరడం కుదరని పని. ఇక మిగతా పార్టీలూ అంత ప్రభావం చూపవు. కాబట్టి ముద్రగడ చేరితే వైసీపీలోనే. అది కూడా పూర్తిగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో ఈ వారంలో తేలిపోతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios