వియవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం జగన్ మౌనం వీడాలని సూచించారు. దివంగత సీఎం, జగన్ తండ్రి వైయస్ఆర్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని గుర్తు చేశారు. 

సీఎం జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడవాలని కోరారు. తండ్రి అడుగుజాడల్లో నడిచే జగన్ ఎస్సీ వర్గీకరణ విషయంపై కూడా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ప్రధానికి లేఖ రాశారని ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 

ఎస్సీ వర్గీకరణకు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ మద్దతు ప్రకటించడమే కాకుండా తమ వైఖరిని ప్రకటించిందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సైతం వర్గీకరణకు అనుకూలంంగా తీర్మాణం చేసి కేంద్రానికి నివేదిక పంపిందని చెప్పుకొచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈనెల 27,28 తేదీల్లో ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.