తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో మాదిగ రిజర్వేషన్స్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) పోటీ చేయనుంది. ఈ మేరకు ఎంఆర్‌పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ గురువారం ప్రకటించారు.

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరఫున బల్లి దుర్గా ప్రసాద్ పోటీ చేసి గెలుపొందారు. కానీ, ఈ ఏడాది సెప్టెంబర్‌లో కరోనా వైరస్ బారిన పడ్డారు. చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో చనిపోయారు.

దీంతో తిరుపతిలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనికి సంబంధించి సంబంధించి టీడీపీ అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ తరఫున బరిలో దింపుతున్నట్లు వెల్లడించారు.

అధికార వైసీపీ నుంచి ఫిజియోథెరపిస్ట్‌ గురుమూర్తిని అభ్యర్ధిగా ఖరారు చేశారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు బీజేపీ కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది.

అయితే పొత్తు ధర్మంలో భాగంగా తిరుపతిని తమకు వదిలి వేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ పంచాయతీ ఇంకా తేలాల్సి వుంది.