టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం వైసీపీకి లేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీలో చేరేందుకు గంటా తన అభిలాషను వ్యక్తం చేశారని విజయసాయి తెలిపారు.

సీఎం జగన్ ఎప్పుడు అంగీకరిస్తే ఆ రోజే పరిగణనలోనికి తీసుకుంటామని.. గంటా వైసీపీలోకి వచ్చినా, రాకున్నా ఎలాంటి మార్పు ఉండదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. 

అంతకుముందు పార్టీ మార్పుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు సహా, మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. పార్టీ మారే ఆలోచన లేదని.. తాను తెలుగుదేశాన్ని వీడుతున్నట్లు గత రెండేళ్లలో 100 సార్లు ప్రచారం జరిగిందని గంటా గుర్తుచేశారు.

ఒకవేళ పార్టీని వీడాల్సి వస్తే అందరికీ ధైర్యంగా చెప్పి నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. 2019 తర్వాత జిల్లాలో తన అనుచరులు చాలా మంది పార్టీ మారారని.. అంత మాత్రాన తాను పార్టీ మారతాననడం కరెక్ట్ కాదని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Also Read:100 సార్లు ఇదే ప్రచారం.. విజయసాయి రెడ్డికి గంటా శ్రీనివాస రావు కౌంటర్

ప్రస్తుతం తన నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపు పైనే తన దృష్టి వుందని గంటా తేల్చి చెప్పారు. వైసీపీలో చేరిన కాశీ విశ్వనాథ్ ఏడాది కాలంగా వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని శ్రీనివాసరావు వెల్లడించారు.

నిబంధనల ప్రకారం నడుపుకుంటున్న వ్యాపారాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. విజయసాయి రెడ్డి ఎటువంటి లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు.

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో మైండ్ గేమ్ లాగే అనిపిస్తుందని గంటా అభిప్రాయపడ్డారు. నేను ఎటువంటి ప్రతిపాదనలు పంపానో విజయసాయి రెడ్డే సమాధానం చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.