శిరోముండనం కేసుపై ఇటీవల సీఎం జగన్ స్పందించగా.. దాని గురించి కూడా మాట్లాడారు.  లేటుగానైనా లేటెస్టుగా సీఎం జగన్ స్పందించినందుకు ధన్యావాదాలని ఆయన అన్నారు. 

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి.. సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. శిరోముండనం కేసులో.. జగన్ బంధువు ఒకరి హస్తం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అసలు 50శాతం మంది జగన్ ప్రభుత్వాన్ని కోరుకులేదని ఆయన పేర్కొన్నారు. శిరోముండనం కేసుపై ఇటీవల సీఎం జగన్ స్పందించగా.. దాని గురించి కూడా మాట్లాడారు. లేటుగానైనా లేటెస్టుగా సీఎం జగన్ స్పందించినందుకు ధన్యావాదాలని ఆయన అన్నారు.

ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ‘‘అయ్యా ముఖ్యమంత్రి, ఈ ఘటన వెనక పార్టీలోని ఓ అతిముఖ్యుడు, మీ సమీపబంధువు ఉన్నాడని నాకు తెలిసింది. ఇన్ స్పెక్టర్‌తో మాట్లాడారని చెబుతున్నారు. శిరోముండనం చేయించమని చెప్పకపోయినా.. తీవ్రంగా దండించమని చెప్పినట్టున్నారు. బంధుప్రీతికి, ఆశ్రితపక్షపాతానికి అతీతంగా ఉంటానని చెప్పారు కాబట్టి చెబుతున్నాను. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు. మీరు నిజనిర్ధారణ చేయండి. మీకు తెలుస్తుంది ఆ విషయం. మీకు మంచి పేరు వస్తుంది. పోలీసులే ఇలా శిరోముండనం చేయించడం భావ్యం కాదు. సోషల్ మీడియాలో కారు కూతలు కూయిస్తూ.. చెడు రాతలు రాయించడం సరైంది కాదు’’ అని పేర్కొన్నారు.

అంతేకాకుండా.. జగన్‌ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతానికి పైగా ప్రజలు కోరుకోలేదని గుర్తించుకోవాలన్నారు. డాక్టర్‌ రమేష్‌ను అరెస్ట్‌ చేస్తామని వేధించి అవమానించామని ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారన్నారు. కానీ అవమానం జరిగింది డా.రమేష్‌కు కాదు... వైద్య వృత్తికి అవమానం చేస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన వృత్తిలో ఉన్నవారిపై కులం పేరుతో కక్ష కట్టడం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు.

జగన్‌ ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా సలహాదారులున్నారని.. ఆ విషయంలో జగన్‌ ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలన్నారు. చేయడానికి పనిలేదని రామచంద్రమూర్తి రాజీనామా చేసినట్టున్నారని ఎద్దేవా చేశారు. మిగతావారి విషయంలో జగన్‌ నిర్ణయం తీసుకుంటే.. ప్రభుత్వ సొమ్మును ఆదా చేసినవారు అవుతారని సూచించారు.