అంతర్వేదిలో రథం తగలపడటంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ప్రశ్నల వర్షం కురిపించారు. అంతర్వేది ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. రథాన్ని ఎవరు తగులబెట్టారో తేల్చాలని డిమాండ్ చేశారు. రథం కాలిపోవడం కుట్రగానే అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. 

సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు వైసీపీ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?, రెండు దేవాలయాలకు కలిపి ఒక ఈవోని నియమిస్తారా?. హిందూ దేవాలయాలు అంటే లెక్కలేదా?, మీకు హిందూపురాణాలు తెలియవు.. అసలు మీ పాలసీ ఏంటి?, ఒక మతం మీద దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు?’’ అని ఆయన ప్రశ్నించారు. అంతర్వేదిలో సీసీకెమెరాలు పనిచేయడం లేదన్నారు. చర్యలు తీసుకోవాలని చెప్పిన వాళ్లు..మీ మంత్రులకు పిచ్చివాళ్లలా కనిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయశాఖ అధికారులను విచారణ చేయమని చెప్పడమేంటి? అని ప్రశ్నించారు. కాగా.. గత కొంతకాలంగా రఘురామ... సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్, ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.