విజయవాడ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి సవాల్ విసిరారు. బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ జాప్యంపై కేశినేని నాని ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌కు చేతకాకపోతే చెప్పాలని.. తాను చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. కేంద్రం నుంచి రూ.1,250కోట్ల నిధుల విడుదల చేయించటంలో... రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ట్విట్టర్‌ వేదికగా కేశినేని నాని ఫైర్ అయ్యారు.
 
‘‘ఇంత చిన్న సమస్యకు పరిష్కారం చూపలేని మీరు ఈ రాష్ట్రం ఎదుర్కుంటున్న అనేక పెద్ద పెద్ద సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తారు జగన్ రెడ్డి గారు? మీకు చేత కాక పోతే చెప్పండి నేను చేసి చూపిస్తా. మీరు నిమ్మగడ్డ వ్యవహారం చూసుకోవచ్చు’’ అని కేశినేని నాని ట్వీట్ చేశారు.

కాగా... కేశినేని చేసిన ట్వీట్ రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే... కేశినేని ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్త పరుస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇదే వేధికపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, వైసీపీ నేత పీవీపీలతో ట్వీట్ల యుద్ధం చేశారు. ఇప్పుడు జగన్ పై విమర్శలు చేస్తున్నారు. మరి కేశినేని పోస్ట్ కి జగన్, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.