డబ్బుల కోసం ఏదో సామాన్య జనాలకు బెదిరింపులు వస్తున్నాయంటే అర్ధముంది. మరీ ప్రజాప్రతినిధులను కూడా బెదిరించాలంటే ఎలా? మరీ అన్యాయం కదా? ఇంతకీ విషయం ఏంటంటారా? చదవండి మరి...  కొద్ది రోజుల క్రితం గవర్నమెంట్ అధికారినంటూ కొందరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అటువంటి పరిస్దితే విశాఖపట్నం జిల్లాలోని అరకు ఎంపి  కొత్తపల్లి గీతకు కూడా ఎదురైంది.

కొద్ది రోజులుగా ఎంపికి పలు బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయట. తాను ఏసీబీ అధికారినని, తన అకౌంట్లో డబ్బులు వేయాలని డిమాండ్ చేస్తూ  ఓ అజ్ఞాత వ్యక్తి అమెకు ఈ మెయిల్ పంపాడు. మొదట్లో ఎవరో ఆకతాయి పని అనుకున్నారు ఎంపి. కానీ పదే పదే వస్తుండటంతో ఎంపి కూడా విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఈ మెయిల్స్ విషయంపై అరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు పంపిన మెయిల్స్ ద్వారా ఐపీ అడ్రస్ కనుక్కొని అతన్ని పట్టుకుంటామని చెప్పారు.