మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు గురించి బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి త్వరలో అరెస్ట్ అవుతాడని జోస్యం చెప్పారు.
కడప : మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి త్వరలో అరెస్ట్ కాక తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అప్రూవర్ గా మారిన దస్తగిరి ప్రాణభయంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దస్తగిరికి రక్షణ కల్పించాల్సిన భార్యత సీఎం జగన్ దే అని తెలిపారు. తనకు ఏమైనా జరిగితే సీఎం బాధ్యత వహించాలన్న దస్తగిరి ఆరోపణలను చూస్తే సీఎం పాత్ర ఉందని అనుమానం వస్తోందని అన్నారు.
వివేకా హత్య వెనుక ఎవరున్నారనే విషయం పులివెందుల ప్రజలకు తెలుసన్నారు. జైల్లో ఉన్న నిందితులకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదని అన్నారు. వివేకా హత్య కేసులో ఇటీవల సీబీఐకి షర్మిల ఇచ్చి వాంగ్మూలం సునీతకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్న నేతల ప్రమేయాన్ని షర్మిల సీబీఐకి స్టేట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం ఉందని బీటెక్ రవి పేర్కొన్నారు.
ఏదో విధంగా అంతం చేయాలని చూస్తున్నారన్న దస్తగిరి: కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు
ఇదిలా ఉండగా, అక్టోబర్ 10న తనకు ప్రాణహాని ఉందని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి అఫ్రూవర్ గా మారిన దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మేరకు కడప ఎస్పీకి, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సోమవారం నాడు కడప ఎస్పీకి, సీబీఐ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని చెప్పాడు. ఆ తరువాత దస్తగిరి కడపలో మీడియాతో మాట్లాడారు. తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండానే తన గన్ మెన్లను మార్చారని దీంతో తాను భయాందోళనలకు గురవుతున్నానన్నారు.
అంతేకాదు, కొత్తగా వచ్చిన గన్ మెన్లు తన రక్షణ గురించి అంత సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గన్ మెన్ల మార్పు గురించి తాను పులివెందుల డీఎస్పీని అడిగానని అయితే, ఆయన తనకు ఆ విషయం తెలియదన్నారని చెప్పారు. గన్ మెన్ల కేటాయింపు ఏఆర్ పోలీసులు చూస్తారన్నారని, ఏఆర్ పోలీసులను ప్రశ్నిస్తే పొంతనలేదని సమాధానాలు చెబుతున్నారని అన్నారు. విజయవాడ నుండి వచ్చిన ఆదేశాల మేరకు గన్ మెన్లను మార్చినట్టుగా తెలిసిందని దస్తగిరి మీడియాకు చెప్పారు.
అంతేకాకుండా పులివెందుల నియోజకవర్గంలోని వైసీపీ నేతలు తనపై అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. తనకు అనుకూలంగా ఉండే గన్ మెన్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు ఏమైనా జరిగితే సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు రాష్ట్ర ప్రజల రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందనన్నారు.
