ఏదో విధంగా అంతం చేయాలని చూస్తున్నారన్న దస్తగిరి: కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి సోమవారం కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ జిల్లాలోని తొండూరు పోలీసులు తనపై అనవసరంగా కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి సోమవారం కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ జిల్లాలోని తొండూరు పోలీసులు తనపై అనవసరంగా కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. తొండూరు పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. అనంతరం దస్తగిరి మాట్లాడుతూ.. తొండూరుకు చెందిన పెద్ద గోపాల్ తరచూ తనను లక్ష్యంగా చేసుకుని గొడవ పడుతున్నారని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్నాననే ఉద్దేశంతో తనను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తన ప్రాణాలకు ముప్పు ఉందని దస్తగిరి చెప్పారు. అన్ని విషయాలను ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకే కడపకు వచ్చినట్టుగా తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టిన విషయాన్ని సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు కూడా వివరించినట్లు దస్తగిరి తెలిపారు. గతంలో కూడా దస్తగిరి తనకు ప్రాణహాని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
గత కొద్ది రోజులుగా వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. సీబీఐ అధికారుల డ్రైవర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించడం తీవ్ర కలకం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ.. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాజాగా దస్తగిరిపై తండూరు పోలీస్ స్టేషన్‌లో దస్తగిరిపై కేసు నమోదైంది.
తొలుత తొండూరుకు చెందిన పెద్దగోపాల్.. దస్తగిరి సోదరుడు మస్తాన్‌పై పెద్దగోపాల్ కేసు పెట్టాడు. ఈ విషయంలో పెద్ద గోపాల్, దస్తగిరికి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో దస్తగిరి తనపై చేయి చేసుకున్నట్లు తొండూరు పోలీస్ స్టేషన్‌లో పెద్దగోపాల్ ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తనను చంపుతానని కూడా బెదిరించాడని పేర్కొన్నాడు. పెద్దగోపాల్ ఫిర్యాదు మేరకు తొండూరు పోలీసులు దస్తగిరిపై కేసు నమోదు చేశారు.
వైఎస్ వివేకా కేసుకు సంబంధించి ఏ చిన్న విషయమైన పెను సంచలనగా మారుతుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన విషయంలో ఏం జరిగినా సంచలనంగా మారుతోంది.