ఒప్పందాలు, ప్రచారం కాదు  కావాల్సింది. నిజమైన కార్చాచరణ కావాలి. దురదృష్టమేమంటే ప్రభుత్వంలో అదే కొరవడింది. ప్రచారం కోసం వందలాది కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటాయి. అందులో పరువు కోసం ప్రభుత్వమే ఏర్పాటు చేసుకునే కంపెనీలు కూడా ఉంటాయి. విశాఖ బాగస్వమ్య సదస్సులో జరిగిందదే.

ఒప్పందాలదేముంది ఎన్నైనా చేసుకోవచ్చు. చేసుకున్న ఒప్పందాలపై స్పష్టమైన కార్యాచరణ ముఖ్యం. ఆ ఒక్కటీ కొరవడింది కాబట్టే గతంలో చేసుకున్న ఒప్పందాలు ఏమయ్యాయో అర్ధంకావటం లేదు. చంద్రబాబునాయుడు వారం రోజుల అమెరికా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖులతో 30 సమావేశాలు నిర్వహించారు. 90కి పైగా కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. చర్చలు సాకారమైతే, ఒప్పందాలన్నీ ఆచరణలోకి వస్తే 1.25 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో వస్తాయట. డెల్, భెల్, టెంపుల్టన్, సిస్కో లాంటి ప్రసిద్ధ కంపెనీలతో చర్చలు జరిగాయి.

ఇవన్నీ బాగానే ఉన్నాయి. ‘అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉంద’న్నట్లుగా తయారైంది ఏపి పరిస్ధితి. ఎందుకంటే, గడచిన మూడేళ్ళల్లో కూడా పెట్టుబడుల కోసమే అమెరికాతో కలిపి చంద్రబాబు అనేక దేశాల్లో తిరిగారు. అయినా ఇప్పటి వరకూ చెప్పుకోతగ్గ కంపెనీ ఒక్కటి కూడా వచ్చిన దాఖలా లేదు. ఉత్త ప్రచారార్భాటం తప్ప కార్యాచరణలో కనిపించింది శూన్యం. ఒప్పందాల విషయంలో గతంలో ఇంతకన్నా ఎక్కువ ప్రచారమే జరిగింది. కానీ జరిగిందేమిటి?

అంతెందుకు, విశాఖపట్నంలో ఇప్పటి రెండు సార్లు భాగస్వామ్య సదస్సులు జరిగాయి కదా? ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయ్? రెండుసార్లు కలిపి సుమారు రూ. 15 లక్షల కోట్ల విలువైన పెట్టుబడలకు ఒప్పందాలు జరిగాయని స్వయంగా చంద్రబాబే చెప్పారు కదా? అందులో వచ్చిన పెట్టుబడులెన్ని? మొదటి సారి నిర్వహించిన సదస్సు వల్ల ఖర్చు దండగ తప్ప ఉపయోగం కనబడలేదు.

ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు స్వయంగా ప్రభుత్వమే చెప్పింది. ఇక రెండోసారి జరిగిన సదస్సు వల్ల జరిగిన ఉపయోగం ఏమిటో ప్రభుత్వం ఇంతవరకూ ప్రకటించలేదు. ‘గోరంత జరిగినా కొండత ప్రచారం’ చేసుకునే ప్రభుత్వం రెండో సదస్సు గురించి ఏమి మాట్లాడటం లేదంటే అర్ధమేమిటి?

కాబట్టి ఒప్పందాలు, ప్రచారం కాదు కావాల్సింది. నిజమైన కార్చాచరణ కావాలి. దురదృష్టమేమంటే ప్రభుత్వంలో అదే కొరవడింది. ప్రచారం కోసం వందలాది కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటాయి. అందులో పరువు కోసం ప్రభుత్వమే ఏర్పాటు చేసుకునే కంపెనీలు కూడా ఉంటాయి.

విశాఖ బాగస్వమ్య సదస్సులో జరిగిందదే. జీడిపప్పు అమ్ముకునే వాళ్ళు, కళాశాలల్లో కమీషన్లపై సీట్లు భర్తీ చేసే వాళ్ళను కూడా పారిశ్రామికవేత్తలుగా చెప్పి ఒప్పందాలు చేసుకుంది. అందుకే ప్రభుత్వం నవ్వులపాలైంది. విదేశీగడ్డ మీద నవ్వులపాలు కాకుండా, ప్రచార కక్కుర్తి కోసం పాకులాడకుండా నిజమైన కార్యాచరణతో ముందుకెళితేనే రాష్ట్రానికి ఉపయోగం.