రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఓడిపోవాలని తిరుమల కొండపై ఉన్న మెట్టు మెట్టుకు మొక్కుకున్నా అన్నారు తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. కొండ ఎక్కేటప్పుడు తనకు బీపీ కూడా డౌన్ అయ్యిందని... దర్శనం తర్వాత రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని చెప్పారు.. బాబు జీవితమంతా దగా, మోసం, వంచనే అంటూ ధ్వజమెత్తారు.

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని.. చంద్రబాబు మోసగాడు అనే విషయం అందరికీ తెలుసునని.. అందుకే ఒక్క పార్టీ కూడా తెలుగుదేశానికి సహకరించలేదన్నారు.

తనకు ప్రత్యేక ప్యాకేజ్ అవసరం లేదని.. ప్రత్యేక హోదానే కావాలని నాడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేసి ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పుడో ప్రత్యేకహోదా వచ్చేదని నర్సింహులు స్పష్టం చేశారు.. జగన్ గెలుస్తాడనే భయంతోనే టీడీపీ అధినేత యూటర్న్ తీసుకుని.. ఇప్పుడు ప్రత్యేకహోదా కావాలని అడుగుతున్నాడని ఆరోపించారు.