అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సొంతపార్టీ ప్రభుత్వ నిర్ణయాలపైనే ఆయన నిరసన గళం వినిపిస్తుండటంతో ఆ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రస్తుత వ్యవహారమంతా కృష్ణంరాజు వ్యక్తిగత విషయమన్నారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారిపై అయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. 

ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సాధించిన విజయంపై  మోపిదేవి మాట్లాడారు. రాజ్యసభలో గుంటూరు జిల్లాకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. తొలి నుంచి గుంటూరు జిల్లాకు రాజకీయంగా ఓ ప్రాధాన్యత ఉందని... జిల్లా అభివృద్ధి కి తన శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. 

read more   రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కరోనా పరీక్షలు: సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న కార్యకర్తల కష్టమే ముఖ్యమని... కార్యకర్తల కష్టాన్ని అమ్ముకున్న  ఏ పార్టీ మనుగడ సాధించదన్నారు. జాతీయ స్దాయిలోని ఏ పార్టీ లోనూ పార్టీ కోసం పని చేస్తున్న వారికి సరైన ప్రాధాన్యం లబించడం లేదన్నారు. 

కులాన్ని తెరపైకి వచ్చి తమ అవసరాలకు వాడుకోవడం మాజీ సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. టిడిపి బిసిలను  ఓటు బ్యాంక్ గానే వాడుకుంటోందని ఆరోపించారు. కేవలం జగన్ మాత్రమే ఇద్దరు బిసిలకు రాజ్యసభ కేటాయించారని... అలాగే అన్ని నామినేటెడ్ పోస్టులలో రిజర్వేషన్ కులాలకు 50 శాతం కేటాయించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. 

భారత దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు వైసిపి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఒక్కటే కాదు కేంద్రం నుంచి రావాల్సిన అన్ని ప్రాజెక్టులపైనా పార్టీ తరపున పోరాటం చేస్తామని మంత్రి మోపిదేవి వెల్లడించారు.