నాలుగేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తూ... పెళ్లిచేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరై యువతిని గర్భవతిని చేసి ముఖం చాటేసిన ఓ సెంట్రల్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ పై విజయనగరం జిల్లాలో కేసు నమోదయ్యింది.
విజయనగరం: ప్రేమిస్తున్నానంటూ వెంటపడి యువతిని నమ్మించాడో పోలీస్. ఎలాగూ పెళ్లిచేసుకుంటాం కదా అంటూ మాయమాటలు చెప్పి యువతికి శారీరకంగానే దగ్గరయ్యాడు. తాజాగా యువతి గర్భం దాల్చడంతో ప్రేమ, పెళ్లి అంటూ చెప్పిన మాటలు మరిచి ముఖం చాటేసాడు. దీంతో మోసపోయిన యువతి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... రామభద్రపురం మండలం మిర్తివలసకు చెందిన పొట్నూరు గోపాలకృష్ణ పోలీస్ శాఖలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. తన గ్రామానికే చెందిన సువ్వాడ ఉషారాణితో అతడు 2019 నుండి ప్రేమాయణం కొనసాగిసతున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో శారీరకంగాను దగ్గరయ్యాడు.
అయితే 2020లో ఈ ప్రేమజంట మధ్య విబేధాలు రావడంతో గ్రామపెద్దల వద్దకు పంచాయితీ చేరింది. పోలీసులు, కేసులు అంటే గోపాలకృష్ణ ఉద్యోగానికి ప్రాబ్లమ్ అవుతుందని ఉషారాణి కుటుంబానికి నచ్చజెప్పి కొంతమొత్తాన్ని ఇప్పించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
అయితే కొంతకాలం తర్వాత మళ్లీ గోపాలకృష్ణ, ఉషారాణి దగ్గరయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అతడు తరచూ ఉషారాణితో కలిసి ఏకాంతంగా గడిపేవాడు. ఇలా వీరిమధ్య శారీరక సంబంధం కొనసాగడంతో యువతి గర్భందాల్చింది. దీంతో పెళ్లిచేసుకోవాల్సిందిగా యువతి ఒత్తిడి తేవడంతో ఆమెను మళ్ళీ దూరంపెట్టసాగాడు.
అయితే ఈసారి గ్రామపెద్దలను కాకుండా జిల్లా మానవహక్కుల సంఘాన్ని కలిసింది ఉషారాణి. వారి సూచనమేరకు ఉషారాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
