ఎప్పటి నుంచో ఉన్న తన కోరిక నెరవేరిందని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. శనివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

తన కోరిక ఫలించడంతో శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. జగన్ మంచి నాయకుడని, మంచి పరిపాలన అందిస్తారని మోహన్‌బాబు పేర్కొన్నారు.

జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోహన్ బాబు వెంటన ఆయన సతీమణి కూడా ఉన్నారు.

ఇదిలా ఉండగా... ఎన్నికల సమయంలో మోహన్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తీరా ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో.. మోహన్ బాబుకి కీలక పదవి దక్కనుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అవన్నీ పుకార్లేనని ఆయన చెబుతన్నప్పటికీ పుకార్లకు మాత్రం పులిస్టాప్ పడటం లేదు. 
 

కాగా..శనివారం మోహన్ బాబు కుటుంబసభ్యులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుటుంబసభ్యులు, హోం శాఖ మాజీ కార్యదర్శి దుగ్గల్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.