చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి మరో సారి షాక్ ఇచ్చారు. రెండు రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా మకాం వేసి ప్రధానిని కలుద్దామని అనుకున్నా సాధ్యం కాలేదు. ముస్సోరిలోని అఖిల భారత అధికారుల శిక్షణా కేంద్రంలో ప్రసంగించిన చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలోనే గడిపారు. అదేసమయంలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ సిఎంవో అంతుకుముందే ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించింది. అయితే, ప్రధాని భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలతో బిజిగా ఉన్న కారణంగా చంద్రబాబును కలవటం కుదరదని స్పష్టంగా చెప్పేసింది. ఆ విషయాన్ని ఓ ఇంగ్లీష్ మీడియాకు స్వయంగా టిడిపి ఎంపినే చెప్పటం గమనార్హం.

గడచిన ఏడాదిన్నరగా చంద్రబాబు-మోడి ముఖాముఖి జరగలేదు. ప్రధాని అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. కారణాలు స్పష్టంగా తెలీకపోయినా మోడి మాత్రం చంద్రబాబును ప్రత్యేకంగా కలవటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదన్న విషయం స్పష్టంగా తెలిసిపోయింది. ఇఫుడు కూడా చేసేది లేక చంద్రబాబు ఢిల్లీ నుండి విజయవాడకు వచ్చేసారు.