ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది: ఏపీ ఎస్ఈసీ సహానీ
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఏపీ ఎస్ఈసీ నీలం సహానీ ప్రకటించారు. జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని పార్టీలను కోరారు.
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఏపీ ఎస్ఈసీ నీలం సహానీ ప్రకటించారు. జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని పార్టీలను కోరారు.
జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ విషయమై అఖిలపక్షంతో శుక్రవారంనాడు ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలతో చర్చించారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.
also read:పరిషత్ ఎన్నికలపై ఏపీ ఎస్ఈసీ మీటింగ్: టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరణ
ఎన్నికల నిర్వహణకు సంబందించి అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకొన్నామన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించినట్టుగా చెప్పారు. గతంలోనే అభ్యర్ధుల జాబితా పూర్తైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇవాళ్టి నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభమైందన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంపై పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయమై ఎస్ఈసీ తీరును నిరసిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐలు సమావేశాన్ని బహిష్కరించాయి.ఎస్ఈసీ నిర్వహించిన సమావేశానికి వైసీపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు.