ప్రతిపక్షానికి చెందిన ఓటర్లను భయపట్టి, కేసులుపెట్టైనా సరే లొండదీసుకోవాలని టిడిపి వ్యూహాలు రచిస్తోంది.
ప్రతిపక్షానికి చెందిన ఓటర్లను భయపట్టి, కేసులుపెట్టైనా సరే లొండదీసుకోవాలని టిడిపి వ్యూహాలు రచిస్తోంది. కడప, ఎర్రగుంట్లలో తాజాగా జరుగుతోందదే. కడపలో కౌన్సిలర్ సురేష్ పైన, ఎర్రగుంట్లలో సుబ్బారెడ్డిపైన జరిగిన దాడులు ఇందులో భాగమే. స్ధానిక సంస్ధల కోటాలో ఎంఎల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో వైసీపీకే బలం ఎక్కువ. మొత్తం ఓట్లలో టిడిపికన్నా వైసీపీకి సుమారు 200 ఓట్లు ఎక్కువున్నాయ. కాబట్టి ఎట్టి పరిస్ధితుల్లోనూ టిడిపి అభ్యర్ధి గెలిచే అవకాశాలు లేవు. అందుకనే వైసీపీ ఓటర్లను భయపెట్టటం, దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం ఎర్రగుంట్ల వైసీపీ కార్యకర్తలపై జమ్మలమడుగు ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడిచేసారు. దాంతో పట్టణంలో ఉద్రిక్తత మొదలైంది.
వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డి ఎర్రుగుంట్లకు వచ్చారు. పట్టణంలోని 17వ వార్డు కౌన్సిలర్ దివ్య, ఆమె తండ్రితో మాట్లాడి తన వెంట తీసుకువెళుతున్నారు. అది తెలుసుకున్న స్ధానికులు కొందరు దివ్యను నిలదీసారట. వైసీపీ తరపున పోటీ చేస్తే తాము ఓట్లు వేసామని, ఇపుడు టిడిపిలోకి ఫిరాయించటమేమిటని సుబ్బారెడ్డి అనే వ్యక్తి నిలదీసారు. సుబ్బారెడ్డికి స్ధానికులు మద్దతుగా నిలబడ్డారు. దాంతో ఏం చేయలేక ఎంఎల్ఏ, ఆయన అనుచరులు దివ్యను వదిలేసి వెళ్లిపోయారు.
అయితే, కొద్దిసేపటికి టిడిపి కార్యకర్తలు వచ్చి సుబ్బారెడ్డిపై దాడిచేసి గాయపరిచారు. దాంతో జమ్మలమడుగు వైసీపీ సమన్వయకర్త సుధీర్ రెడ్డి అండతో బాధితుడు పోలీసు స్టేషన్ కు వెళ్లి దాడిచేసిన వారిపై ఫిర్యాదు చేసారు. అయితే, విషయం తెలియగానే పోలీసు స్టేషన్ కు వచ్చిన ఎంఎల్ఏ ఇద్దరికీ రాజీ చేయబోయారు. అయితే, బాధితుడు అంగీకరించకపోవటంతో పోలీసు స్టేషన్లోనే మళ్ళీ దాడిచేసారు. ఇంతలో విషయం తెలుసుకున్న కడప ఎంపి అవినాష్ రెడ్డి పోలీసుస్టేషన్ కు వచ్చారు. దాంతో ఇరువైపులా భారీ ఎత్తున కార్యకర్తలు చేరి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దాంతో నియోజకవర్గం మొత్తం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇపుడు స్టేషన్లో ఎంఎల్ఏ, స్టేషన్ బయట ఎంపిలు కూర్చున్నారు. ఏం చేయాలో తెలీక పోలీసులు తలలు పట్టుకున్నారు.
