గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీలో నెలకొన్న విభేదాలపై స్పందించారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. ఎమ్మెల్యే శ్రీదేవి కొంత బాధతో వున్నారని... మాట్లాడి కలిసి పనిచేస్తామన్నారు. రైతులు ముందుకొస్తే రాజకీయాలకు అతీతంగా పరిష్కారానికి కృషి చేస్తానని డొక్కా హామీ ఇచ్చారు.

గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీలో నెలకొన్న విభేదాలపై స్పందించారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. వైసీపీలో గ్రూపు రాజకీయాలకు తావు లేదని డొక్కా స్పష్టం చేశారు. ఉన్నది ఒకటే గ్రూపు వైసీపీ పార్టీ.. జగన్‌మోహన్ రెడ్డి గ్రూపు అని ఆయన పేర్కొన్నారు. తాడికొండలో తనను అదనపు సమన్వయకర్తగా నియమించే విషయం తనకు తెలియదని డొక్కా అన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి కొంత బాధతో వున్నారని... మాట్లాడి కలిసి పనిచేస్తామని మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. రాజధాని అంశం పూర్తిగా అధిష్టానం నిర్ణయమని.. రాజధాని రైతులకు చాలా సమస్యలున్నాయని మాణిక్య వరప్రసాద్ తెలిపారు. రైతులు ముందుకొస్తే రాజకీయాలకు అతీతంగా పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

ఇకపోతే.. తాడికొండ నియోజకవర్గానికి వైసీపీ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీచేసింది. అయితే ఈ నియామకం పార్టీలో రచ్చకు కారణమైంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గం ఆందోళనకు దిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్‌ కొనసాగుతుండగా.. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను అద‌న‌పు స‌మ‌న్వయ‌క‌ర్తగా నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ALso REad:మాజీ హోం మంత్రి సుచరిత ఇంటి ముందు ఉండవల్లి శ్రీదేవి నిరసన.. ఆ నిర్ణయంపై అసంతృప్తి

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. వైసీసీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఇంటి ముందు ఆందోళనకు దిగారు. సుచరిత ఇంటి ముందు.. ఉండవల్లి శ్రీదేవి, ఆమె అనుచరుల బైఠాయించారు. దాంతో సుచరిత ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ నియామకంతో ఉండవల్లి శ్రీదేవిని అవమానించారని ఆమె అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై పార్టీ అధిష్టానంతో మాట్లాడుదామని ఉండవల్లి శ్రీదేవికి సుచరిత నచ్చజెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఇక, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ గతంలో తాడికొండ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా కూడా పని చేశారు.