గుంటూరు: తెలంగాణ సీఎం కేసీఆర్ పై గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మందు తాగినప్పుడు ఒక మాట మత్తు దిగాక మరోమాట మాట్లాడతారని విమర్శించారు. మత్తులో హెలికాప్టర్‌ ఎక్కబోయి మహబూబ్‌నగర్‌లో పడిపోలేదా అని ప్రశ్నించారు.

కేసీఆర్ కి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు అని అలాంటి వ్యక్తిపై నోటికొచ్చినట్లు మాట్లాడతారా అంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం రెండోసారి గెలిచినంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు తిడతారా అంటూ మండిపడ్డారు. 

చంద్రబాబుపై కేసీఆర్ ఉపయోగించిన పదజాలం భారతదేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడూ ఉపయోగించలేరన్నారు. మరోవైపు ప్రత్యేక హోదా విషయంలో అడ్లుపుల్ల వేసిన కేసీఆర్‌ ఆంధ్రాలో ప్రచారం చేస్తే టీడీపీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. 

బాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానంటున్న కేసీఆర్ ఏం ఇస్తారో ఇవ్వాలని సవాల్ విసిరారు.  పాతికేళ్ల నుంచి బాబు భారత రాజకీయాలను శాసిస్తున్నారని, ఆయన చెప్పిన వాళ్లే రాష్ట్రపతి, ప్రధానమంత్రులు అయ్యారని గుర్తు చేశారు.