ఎమ్మెల్యే రోజా చేసిన పూజల ఫలించాయి. ఎట్టకేలకు ఆమెకు మంత్రి పదవి దక్కింది. వైసీపీకి చాలా కాలం నుంచి అండగా ఉంటూ వస్తున్న రోజాకు సీఎం జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు.
ఏపీలోని నగరి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్కే రోజా మంత్రి కాబోతున్నారు. సోమవారం ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2014 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రోజా నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 1999లో నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమెకు దాదాపు 22 సంవత్సరాల తరువాత మంత్రి అయ్యే ఛాన్స్ వచ్చింది. దీంతో ఆమె చేసిన పూజలు ఫలించినట్లైంది.
రోజా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 1999 లో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో టీడీపీలో పని చేసిన ఆమె.. తరువాత వైఎస్సార్ సీపీలో చేరారు. ఆ పార్టీ తరుఫున నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014 ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తరువాత వచ్చిన 2019 ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మొదటి సారి టీడీపీ నేత గాలి ముద్దకృష్ణమనాయుడిని, రెండో సారి ఆయన కుమారుడు గాలి భానుప్రకాశ్ ను చిత్తుగా ఓడించారు.
2014 ఎన్నికల కంటే ముందే వైసీపీలో చేరిన ఆమె మొదటి నుంచి జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. అసెంబ్లీలో వైసీపీ వాయిస్ ను వినిపించడంలో కీలకంగా పని చేశారు. దీంతో ఆమె సీఎం జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితురాలిగా మారారు. 2019 ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఆ సమయంలో ఆమె మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ అవకాశం దక్కలేదు. కానీ ఆమెకు సీఎం జగన్ ఏపీఐఐసీ చైర్మన్ గా అవకాశం కల్పించలేదు. మంత్రి పదవి రాలేదని ఆమె ఎక్కడా అసంతృప్తికి గురవలేదు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తూనే వెళ్లారు.
కాగా ఎమ్మెల్యే రోజా మంత్రి పదవి చేపట్టేందుకు ఎన్నో పూజలు చేశారు. ఏపీ, తెలంగాణలోని అనేక దేవాలయాలను ఆమె సందర్శిస్తూ ఆమె పూజలు చేసేవారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి వేంకటేశ్వర స్వామిని అనేక సార్లు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. ఇలా పూజలు చేసే సమయంలో తిరుపతిలో మీడియాతో మాట్లాడేవారు. అనేక రాజకీయ ప్రకటనలు అక్కడి నుంచే చేసేవారు. దీంతో ఆమె ఏపీ వార్తల్లో తరచూ కనిపించేవారు.
ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయాలని అనుకున్నా.. తన పార్టీపై వచ్చే ఆరోపణలు ఖండించాలని భావించినా ఎమ్మెల్యే రోజా తిరుమల తిరుపతి దేవాలయాన్నే వేధికగా ఎంచుకునేవారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఆ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఒక కారణమైతే, అక్కడ మాట్లాడితే రాష్ట్ర స్థాయి మీడియాలో మొత్తం వినిపిస్తుందనేది మరో కారణం. అందుకే ఆమె అక్కడే ఎక్కువగా మాట్లాడేవారు. గత కొన్నేళ్లుగా ఆమె మీడియాకు ఇచ్చిన స్టేట్ మెంట్లను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
రోజా చేసిన పూజలు, తిరుపతి దేవాలయ ప్రాంగణంలో ఇచ్చిన పొలిటికల్ స్టేట్ మెంట్ల ఫలితంగానే ఆమెకు మంత్రి పదవి దక్కిందని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఆమెకు ఏ శాఖ కేటాయిస్తారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. సీఎం జగన్ తో రోజాకు సాన్నిహిత్యం ఉండటం వల్ల ఆమెకు కీలక పదవి ఇస్తారనే చర్చ సాగుతోంది. కాగా ఎమ్మెల్యే రోజా వికీపిడియాలో ఆమె హోం మంత్రిగా ఏప్రిల్ 11వ తేదీన బాధ్యతలు చేపట్టారని చేరింది.
