వైసీపీ ఎమ్మెల్యే , సినీ నటి రోజా ఇంట సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ఆమె భర్త, డైరెక్టర్ శెల్వమణికి కీలక పదవి దక్కింది. ఇటీవల రోజాకి జగన్ ప్రభుత్వం ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవిని ఆమెకు కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త శెల్వమణి.. తమిళనాడు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు.

తన ప్రత్యర్థి దర్శకుడు విద్యాసాగర్ పై 1386ఓట్ల భారీ తేడాతో శెల్వమణి విజయం సాధించారు. దీంతో... శెల్వమణికి సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే... నగరి ఎమ్మెల్యేగా రోజా ఇప్పటికి రెండు సార్లు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమె మంత్రి కావడం ఖాయమని అందరూ భావించారు. 

కానీ... కుల సమీకరణంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ ... ఆమెను పక్కన పెట్టారు. దీంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ ఆమెతో చర్చలు జరిపి ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవిని కేటాయించారు. మంత్రి పదవి కాకపోయినా .. నామినేటెడ్ పదవి దక్కడంతో ఆమె సంతోషం వక్తం చేశారు. ఆమె కు ఈ పదవి దక్కిన కొద్ది రోజులకే భర్త శెల్వమణికి కూడా కీలక పదవి దక్కడం పట్ల కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.